విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా నిర్ణయించిన తర్వాత… అధికారిక ప్రకటన చేయడానికి కొద్ది రోజుల ముందు.. .. తన అమూల్యమైన వరాన్ని తన నోటి ద్వారా ప్రకటిస్తారని ఎదురు చూసిన విశాఖ వాసులకు జగన్.. ఆ అదృష్టాన్ని కల్పించలేదు. విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించి.. శంకుస్థాపన చేయాల్సిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. సైలెంట్ గా వెళ్లిపోయారు. మామూలుగా అయితే.. విజయసాయిరెడ్డి గత వారం రోజులుగా చేస్తున్న హడావుడికి.. విశాఖలో బాక్సులు బద్దలైపోవాలి. కానీ.. పరిస్థితులు అలా కనిపించలేదు. జగన్ ప్రసంగించకపోవడంపై వైసీపీ నేతల్లోనే రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి.
మధ్యాహ్నం విశాఖ చేరుకున్న జగన్ కు.. ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర మానవహారంతో… స్వాగతం పలికేలా.. వారం.. పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. నిజంగా కేబినెట్లో రాజధాని నిర్ణయాన్ని తీసుకుని ఉంటే… కళకళలాడేదేమో కానీ.. స్వాగతం ఆ స్థాయిలో లేదు. ముందస్తుగా.. చేసిన జనసమీకరణ వర్కవుట్ అయి.. మానవహారం.. కనిపించినా.. వైసీపీ శ్రేణుల్లో.. రాజధాని స్థాయి ఉత్సాహం..లేదు. విజయసాయిరెడ్డి ప్రకటించిన విధంగా.. కనీవినీ ఎరుగుని రీతిలో స్వాగతం మాత్రం లభించలేదు. కానీ …కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైసీపీ నేతలు.. విశాఖను.. అలంకరించారు. బెలూన్లు.. బ్యానర్లతో హోరెత్తించారు.
విశాఖ ఉత్సవ్ వేదిక మీద జగన్… ప్రకటన చేస్తారన్న ఉద్దేశంతో.. ఎమ్మెల్యేలు, ఎంపీలు , స్థానిక నేతలు పెద్ద ఎత్తున.. జనాల్ని సమీకరించారు. దాంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది. జగన్ గొప్పతనం గురించి.. ఓ డాక్యుమెంటరీ లాంటి షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. విశాఖ ప్రత్యేకతను ఆవిష్కరించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. వాటిని చూసి.. ధన్యవాదాలు చెప్పి జగన్ వెళ్లిపోయారు. దాంతో.. విశాఖ వాసులకు.. నిరాశ ఎదురయినట్లయింది.