ముద్రగడ పద్మనాభం దంపతులు నాలుగురోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఆయన కోరిన డిమాండ్లను కొద్ది మార్పులతో తీర్చడానికి ప్రభుత్వం దిగిరావడంతో ముద్రగడ తన దీక్షను విరమించడానికి సిద్ధమయ్యారు. దీక్ష విరమణ తర్వాత దయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరఫున ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. జీవో ద్వారా బీసీల్లో చేర్చడం వలన కొన్ని నష్టాలు ఉన్నాయని వారు వివరించిన దానిని కూడా ఆమోసదించినట్లు ముద్రగడ తెలియజెప్పారు.
20 ఏళ్లుగా మూలన పెట్టుకున్న ఉద్యమాన్ని.. మళ్లీ పైకి తీసుకువచ్చామంటే కేవలం మీరు ఇచ్చిన హామీ ద్వారా మాత్రమే సాధ్యం అయింది అని మాట్లాడిన ముద్రగడ పద్మనాభం ‘నేను అనరాని మాటలు అని ఉంటే మొన్న జరిగిన సంఘటనలకు క్షమించమని కోరుకుంటున్నాను.’ అంటూ సారీ చెప్పేశారు.
జాతికి తన జీవితం చేశానని, వారి కోసం మాత్రమే ఈ పోరాటం సాగించానని ముద్రగడ చెప్పారు. మా జాతి వారి కడుపుమంటను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మాత్రమే ఈ దీక్ష చేసినట్లు చెప్పారు. కొన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, కొన్ని విషయాల్లో సమస్యలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. దీక్ష విరమిస్తున్నానని చెప్పారు. మా జాతికి అన్నం పెట్టమని అడుగుతున్నాను. జాతికి ఆకలి తీర్చాలనే రోడ్డెక్కాను అని ఆయన చెప్పారు. ఒకవైపు వయసు పైబడుతోందని.. ఇదే డిమాండుతో మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి తేవద్దని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
తన జాతిలో కూడా అందరికీ రిజర్వేషన్ కావాలని కోరడం లేదని, అత్యంత పేదవాళ్లకు మాత్రమే రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం… సంపన్నులకు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను కోరుతున్నాను అని కూడా ముద్రగడ పద్మనాభం చెప్పారు. తనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తమ తమ ప్రాంతాల్లో దీక్షలు చేస్తున్న వారందరూ విరమించాల్సిందిగా ఆయన కోరారు. తనకు సంఘీభావం తెలియజేయడానికి తరలివచ్చిన దాసరి, చిరంజీవి, రఘువీరారెడ్డి తదితర ప్రముఖులందరికీ కూడా ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు.