అమరావతికి రూ. లక్షా తొమ్మిది వేల కోట్లు ఖర్చవుతుంది.. ఇప్పటి వరకూ.. ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు… అని ప్రభుత్వం.. మంత్రులు.. అదే పనిగా చెబుతున్నారు. కానీ.. అసలు నిజం మాత్రం… అమరావతిపై ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు రూ. పది వేల కోట్లపైనే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వంలో ఏమేం చేశారో చెబుతూ.. కొన్ని శ్వేతపత్రాలను విడుదల చేశారు. వాటిలో… అమరావతి గురించి కూడా ఉంది. జూన్ ఇరవై ఎనిమిదో తేదీన అమరావతి..సీఆర్డీఏ వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో.. అమరావతి కోసం గత ప్రభుత్వం 9,165 కోట్లు ఖర్చు చేసిందని..స్పష్టం చేసింది. ఇవి కాకుండా.. రైతులకు కౌలు చెల్లింపు. భూమి లేని పేదలకు పెన్షన్ ఇలాంటి సామాజిక పనుల కోసం.. రూ. 1300 కోట్లు ఖర్చు చేసింది. ప్రణాళికలు, డిజైన్లు రూపొందించిన ఆర్కిటెక్చర్, కన్సల్టెన్సీ సంస్థలకు మరో రూ.400కోట్లకుపైగా ఖర్చయింది. ఎలా చూసినా ఖర్చు.. రూ. పదివేల కోట్లకు దాటిపోయింది. కానీ దీన్ని ప్రభుత్వం రూ. ఐదు వేల కోట్లకు తగ్గించి చెబుతోంది.
రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేసి.. గ్రాఫిక్స్ మాత్రమే.. సృష్టించారని.. మంత్రులు చెబుతూ ఉంటారు. కానీ అక్కడ ప్రపంచ స్థాయి నిర్మాణాలు కొన్ని పూర్తయ్యాయి..మరికొన్ని.. చివరి దశలో ఉన్నాయి. వెలగపూడిలోని ప్రస్తుత సచివాలయం, శాసనసభ భవనాలు: మొత్తం 6.20 లక్షల చదరపు అడుగులు పూర్తయింది. దీన్ని ఉపయోగించుకుంటున్నారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ 2.5 లక్షల చదరపు అడుగులు.. దీన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయ భవనం…రూ.7.59కోట్లతో ప్రజావేదిక కూడా నిర్మించారు. కాకపోతే దీని కూల్చివేత కూడా జరిగిపోయింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్గెజిటెడ్ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగులకు అపార్ట్మెంట్ల నిర్మాణం. ఇవన్నీ 55 నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు బంగ్లాల నిర్మాణాలు 30శాతం పూర్తయ్యాయి. ప్రధాన రహదారులు, వంతెరను.. దాదాపుగా యాభై శాతం పూర్తయ్యాయి. చివరికి.. కొండవీటివాగు వల్ల రాజధానికి వరద ముంపు ఉంటుందనే భావనతో ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేశారు. ప్రభుత్వం అమరావతిలో ఏమీ జరగలేదని చెప్పడానికి రూ. ఐదు వేల కోట్లు తక్కువ చేసి చెబుతున్నా.. ఇక రాజధానిని మార్చేస్తే.. ఆ పది వేల కోట్ల బూడిదలోపోసిన పన్నీరేనన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.