ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ ఓ స్పష్టమైన విధానంతో ఉంది. అమరావతికే కట్టుబడి ఉండాలని.. ఈ మేరకు నేతలకు సూచనలు అందాయి. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు.. సంఘ్, విహెచ్ పికి చెందిన నేతలు బిజెపి అగ్రనేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆర్. ఎస్. ఎస్, వి.హెచ్.పి కీలక నేతలు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది నేతలతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుోతంది. బిజెపిలో భిన్నస్వరాలు వినిపించేందుకు వీలు లేదని, అలా ఎవరైనా మాట్లాడితే పార్టీ పరంగా హెచ్చరించాలని, వినకపోతే చర్యలు తీసుకోవాలని సంఘ్ పెద్దలు బిజెపి అగ్రనేతలకు స్పష్టం చేశారు,.
మత మార్పిడులపై ఏపి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు అనుసరిస్తున్న తీరు, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారంపై వి.హెచ్.పి సీరియస్ గా ఉంది. ఈ నేపధ్యంలోనే అమరావతి తరలింపును తెరపైకి తీసుకురావడం పట్ల బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిజెపిలోని కొంతమంది నేతలు భిన్నస్వరాలు వినిపించడం పట్ల ఆర్.ఎస్.ఎస్ తప్పుబట్టింది. ఇదే విషయాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు స్పష్టం చేసింది. ఢిల్లీలో ఉన్న ఓ నేత రాజధానిపై భిన్నస్వరం వినిపించడంపై తాము ఇప్పటికే అగ్రనేతల దృస్టికి తీసుకువెళ్లామని కూడా ఆర్.ఎస్.ఎస్ నేతలు చెప్పినట్లు తెలిసింది .
ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో శంఖుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారని, ఇప్పటికే కేంద్రం అమరావతి నిర్మాణం, రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలకు 2వేల 500కోట్ల రూపాయలను మంజూరు చేసిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో నేతలు ప్రస్తావించారు. పవిత్ర జలాలు, పవిత్ర మట్టిని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి, యజ్ఞం నిర్వహించి, శంఖుస్తాపన చేసిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం, రైతుల త్యాగాన్ని విస్మరించడం మంచిది కాదని ఆరెస్సెస్ చెబుతోంది. దీంతో.. అమరావతి విషయంలో కేంద్రం ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.