అమరావతి విషయంలో ఇంత కాలం జరుగుతున్న పోరాటానికి ఇక నుంచి పవన్ కల్యాణ్ మార్క్ స్పెషాలిటీ జోడీ కానుంది. క్రిస్మస్ సెలవుల కోసం.. యూరప్ వెళ్లిన పవన్ కల్యాణ్ తిరిగి వచ్చారు. రాగానే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఈ రోజు…విజయవాడలో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా అమరావతిపై.. తన కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను పవన్ కల్యాణ్ మొదట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఈ లోపు రైతులకు మద్దతుగా… పార్టీ నేతలను పంపించారు.
ఇప్పుడు.. పరిస్థితులు కొంత మారాయి. రాయలసీమలో.. విశాఖ రాజధానిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. అలాగే విశాఖ వాసుల్లోనూ.. అంత సానుకూలత లేదు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తోందని.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ నేతలు అక్కడి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా… వారంతా.. ముందు సంతోషపడటానికి బదులు భయపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే పవన్ కల్యాణ్.. రాజధాని విషయంలో మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. ఆయన రాజధాని రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు దిగుతారని అంటున్నారు. అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేందుకు ప్రత్యేక పోరాటం కూడా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
తన సోదరుడు చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ.. ఆ ప్రభావం జనసేన శ్రేణులపై పడలేదు. అది ఫేక్ లెటర్ అని ప్రచారం చేసి.. నొప్పింపక.. తానొవ్వక అన్న రీతిలో.. తాము అంగీకరించబోమని తేల్చేశారు. పవన్ కల్యాణ్ కూడా.. రాజకీయ విధానాల విషయంలో.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా.. తన దారిలో తాను పయనించే అవకాశం కనిపిస్తోంది. రాజధాని పోరాటంలో.. పవన్ కల్యాణ్ ఎంట్రీ.. కొత్త మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది.