ఉదయం..
సుజనా చౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను కేంద్రంతో మాట్లాడే చెబుతున్నానని.. రాజధానిని అంగుళం కూడా కదిలించడం సాధ్యం కాదని ప్రకటించారు.
మధ్యాహ్నం
ప్రభుత్వం ఉన్న పళంగా హైపవర్ కమిటీని ప్రకటించింది…!
ఈ రెండు వేర్వేరుగా అనిపిస్తున్నప్పటికీ.. కనిపించని లింక్ మాత్రం ఉందని.. రాజధాని రాజకీయాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న వారు అంటున్నారు. రాజధానిగా అమరావతిని మార్చి విశాఖను చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. కేంద్రం నుంచి సానుకూలత అందడం లేదు. జగన్ అసెంబ్లీలో మొదట మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినప్పుడు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్వాగతించారు. కానీ తర్వాత తీవ్రంగా తప్పు పడుతున్నారు. మౌనదీక్ష కూడా చేశారు. ఆరెస్సెస్ కూడా అమరావతికే మద్దతు తెలిపింది. మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని తరలించడం.. బీజేపీకి అవమానమనే సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించేశారు. ఇవన్నీ వైసీపీకి అటంకాలుగా మారాయి. ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగే పరిస్థితి వచ్చేసిందన్న అభిప్రాయం.. సుజనా మాటలతో స్పష్టమయింది.
కేంద్రం ప్రయత్నాలకు.. కౌంటర్ వేసే క్రమంలో… తాము అంత కంటే వేగంగా అడుగులు వేయాలన్న ఆలోచనతోనే… ఏపీ సర్కార్.. ఆదివారం అయినప్పటికీ.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక రానప్పటికీ.. హైపవర్ కమిటీని ప్రకటించేసిందని చెబుతున్నారు. రాజధానిని విశాఖకు ఎంత తొందరగా తీసుకెళ్లాలా.. అని తాపత్రయ పడుతున్న ఏపీ సర్కార్.. కేంద్రం ఎక్కడ అడ్డు పడుతుందో అన్న ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌తో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వస్తుందని.. ఆ రెండింటిని పరిశీలించి సిఫార్సులు చేసేందుకు హైపవర్ కమిటీని నియమించాలని.. కేబినెట్లో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు.. వచ్చే నెల మొదటి వారంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత మూడో తేదీ లేదా నాలుగో తేదీ కేబినెట్ సమావేశం పెట్టి.. హైపవర్ కమిటీని నియమించాలని అనుకున్నారు. కానీ.. బోస్టన్ నివేదిక అందక ముందే.. హైపవర్ కమిటీని ప్రభుత్వం ప్రకటించేసింది.
మూడు వారాల్లో కమిటీ రిపోర్టును ఇవ్వాలని.. ప్రభుత్వం వీరికి సూచించింది. అయితే.. మూడు వారాల గడువు ఎప్పటి నుండి అనేది క్లారిటీ లేదు. బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చినప్పటి నుండా లేక… నియామకం జరిపిన ఈ రోజు నుంచా.. అన్నది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. బహుశా.. వచ్చే నెల పద్దెనిమిది లేదా పందొమ్మిదో తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టనున్నందున.. ఆ లోపున తాము అనుకున్న నివేదిక ఇవ్వడానికి.. ఆదివారం అయినప్పటికీ.. ఈ రోజు నియామకం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లోపు జగన్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. రాజధాని తరలింపు అంశం.. దేశ ఆర్థిక పరిస్థితిపైనే కాదు.. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు.. అమరావతి విషయంలో.. కేంద్రం వర్సెస్ జగన్ అన్నట్లుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.