అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనుకూల మీడియా.. వ్యతిరేక మీడియా అంటూ విభజించుకుని.. వ్యతిరేక మీడియాపై.. ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఏపీ సర్కార్.. సమాచార మంత్రి పేర్ని నాని.. టీవీ9 రిపోర్టర్ పై జరిగిన దాడి విషయంలో మాత్రం.. తన కంటే మిన్నగా ఫోర్త్ ఎస్టేట్ను కాపాడేవారు ఉండరన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. విలేకర్లపై గొడ్డుకన్నా దారుణంగా కర్రలతో దాడి చేశారని.. అయినా తోటి జర్నలిస్టులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎగబడతారు.. జర్నలిస్టు సంఘాలు ఏం చేస్తున్నాయని .. ఈసడించారు. పత్రికా సమాజం ఏమైంది..? .. జర్నలిస్టులను కొడితే సంఘాలు కనీసం స్పందించవా? అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. విలేకరులపై విచక్షణారహితంగా దాడి చేస్తే.. విలేకరుల సమాజం స్పందించకపోవడం విడ్డూరమని .. క్రూరజంతువులు కూడా ఇంత దారుణంగా దాడి చేసి ఉండరని ఆక్షేపించారు.
జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తేల్చారు. జర్నలిస్టుల దాడి విషయంలో చంద్రబాబు తీరును ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులపై దాడి పేరుతో పేర్ని నాని రైతులను క్రూర జంతువులతో సహా పలు విధంగా పోల్చి.. కించ పరిచారు. నిజానికి జర్నలిస్టు అత్యంత దయనీయమైన పరిస్థితులను ఈ ప్రభుత్వంలోనే ఎదుర్కొంటున్నారు. తుని ఓ జర్నలిస్టును పట్ట పగలు హత్య చేసినా ప్రభుత్వ స్పందన శూన్యం. పలు టీవీ చానళ్లను బ్యాన్ చేసి.. పీక నొక్కే ప్రయత్నం చేసింది.. ఈ ప్రభుత్వం. పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు జర్నలిస్టులపై చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు.
జమీన్ రైతు అనే పత్రికా సంపాదకుడు ఇంటికి వెళ్లి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంపుతానని బెదిరించినా..సమాచార ప్రసార మంత్రి పేర్ని నానికి ఆయన జర్నలిస్టుగా గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వాళ్ల ముందే వాళ్లని పెయిడ్ ఆర్టిస్టులంటూ.. రిపోర్ట్ చేస్తూ కించ పరిచిన సమయంలో జరిగిన దాడిని.. పేర్ని నాని తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. మొత్తానికి రైతుల మీదకు.. జర్నలిస్టు సంఘాలను ఉసిగొల్పడానికి పేర్ని నాని.. తన వంతు ప్రయత్నం చేశారు. రైతుల ధర్నాకు కవరేజీ రాకుండా.. మీడియా చానళ్లను.. ప్రోత్సహించే దిశగా.. అడుగు వేశారు.