పౌరసత్వ చట్ట సవరణ, ఎన్నార్సీ వల్ల భారత దేశ పౌరులెవరికీ ఇబ్బంది రాదని.. చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతోంది. వాటి గురించి విపక్షాలు చేస్తున్న ప్రచారం అంతా అబద్దమేనని.. తాము చెప్పేదే నిజమని నమ్మాలని… దేశవ్యాప్తంగా ప్రెస్మీట్లు, సభలు పెట్టి.. ఆ పార్టీ నేతలు.. దాదాపుగా బతిమాలినంత పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కొద్ది రోజులుగా.. ఢిల్లీ నుంచి కీలక నేతలు వస్తున్నారు. సభలు, సమావేశాలు పెట్టి… సీఏఏ, ఎన్నార్సీ వల్ల .. ఎలాంటి నష్టమూ లేదని చెబుతున్నారు. కానీ వాటికి లభిస్తున్న ప్రచారం అంతంతమాత్రమే. ఎవరు.. ఎప్పుడు వచ్చినా బీజేపీ కార్యకర్తలతో సమావేశం పెట్టడం.. మీడియా మీట్ నిర్వహించడం వెళ్లిపోవడం కామన్ అయిపోయింది.
దాంతో అసలు వారు ఏం చెప్పడానికి వచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కిషన్ రెడ్డి, జీవీఎల్.. తెలంగాణ, ఆంధ్రల్లో ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ వారు ఎన్నార్సీ, సీఏఏ గురించి చెప్పారు.. తర్వాత .. స్థానిక రాజకీయాల గురించి మాట్లాడారు. మీడియా.. అసలు వారు ప్రెస్ మీట్ పెట్టిన కారణాలన్ని వదిలేసి.. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడిన దాన్ని మాత్రమే నోట్ చేసుకుంది. ఫలితంగా వారి శ్రమ వృధా అయిపోయింది. ఓ నిజం గడప దాటేలోపు.. అబద్దం ప్రపంచం అంతా చుట్టి వస్తుందన్నట్లుగా.. విపక్షాలు.. ఎన్నార్సీ, సీఏఏలపై ప్రజల్లో ఉన్న ఆందోళనను మరింత పెంచుుంటూ పోతున్నాయి. హిందువులు కూడా.. పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భయపెడుతున్నాయి. దాంతో బీజేపీ నేతల ప్రచారానికి పెద్దగా స్పందన రావడం లేదు. ఇప్పుడు పౌరసత్వం జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముందన్న చర్చ ప్రజల్లోనూ నడుస్తోంది.
దీంతో బీజేపీకి గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకుని.. ఇతర పార్టీలపై… అబద్దాలో..నిజాలో.. ఏదో ఒకటి విస్తృతంగా ప్రచారం చేసి.. మైలేజీ పొందిన బీజేపీ.. ఇప్పుడు.. అలాంటి ప్రచారానికే ఇబ్బంది పడుతోంది. అనూహ్యంగా సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వడంపై ప్రెస్ మీట్లు, సభలపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో విపక్షాల ప్రచారంతో చూస్తే వెనుకబడినట్లుగా మారిపోతోంది.