కర్నూలులో హైకోర్టు పెడతామని జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నారని.. హైకోర్టును పెట్టడానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న అధికారమేంటో చెప్పాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సోమవారం డిమాండ్ చేశారు. నిజానికి .. ప్రజల్లో దీనిపై పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. ప్రభుత్వం తరలిస్తే.. హైకోర్టు వెళ్లిపోతుందనుకున్నారు. అందుకే రాయలసీమలో కూడా.. ఈ విషయంపై సానుకూల స్పందన మొదట్లో వచ్చింది. కానీ.. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు .. అసలు ప్రాసెస్ ఎంటో చెప్పి.. ప్రభుత్వం మోసం చేసిందని…చేస్తోందని చెబుతూండటంతో.. ప్రజల్లో కూడా చర్చ ప్రారంభమయంది.
మొదట్లో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా ఇప్పుడు.. పవన్ కల్యాణ్ మాట్లాడినట్లుగానే మాట్లాడుతున్నారు. హైకోర్టు కర్నూలుకు ఇప్పుడల్లా రాదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదని.. టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. దీనికి కారణం.. హైకోర్టును.. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చాలంటే.. రాష్ట్రపతి ద్వారానే సాధ్యం. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు… మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం అడుగుతారు. ఒక సారి ఏర్పటయిన తర్వాత పాలకులు తమ చిత్తం వచ్చినట్లుగా హైకోర్టును మార్చడానికి లేదు. కేంద్రం నోటిఫై చేయాలి. రాష్ట్రపతి ఆమోదించాలి. దాని కోసం రాజ్యాంగపరమైన ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు కేంద్రానికి అంత తీరిక లేదు. వైసీపీ కోసం.. తీరిక చేసుకోవాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న ఏకైక ఎజెండాతోనే.. రాజకీయ అడుగులు వేస్తున్నారని.. రాయలసీమలో వ్యతిరేకత రాకుండా హైకోర్టు ప్రకటించారన్న చర్చ జరుగుతోంది. హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేకపోయినప్పటికీ.. ఇలాంటి ప్రకటన ద్వారా.. రాయలసీమలో వ్యతిరేకత రాకుండా చూసుకుని రాజధానిని విశాఖ తరలించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే నేతల ప్రకటనల ద్వారా.. ఈ విషయం స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.