రాజధానిపై నియమించిన జీఎన్ రావు , బీసీజీ కమిటీల చట్టబద్ధతపై హైకోర్ట్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను వివరాలు అడిగింది. రాష్ట్రంలో పట్టణ, నగర ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీతోపాటు ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీలో పేర్కొన్న బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ చట్టబద్ధతపై హైకోర్ట్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత జీఎన్ రావు కమిటీ చట్టబద్ధతపై అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల మొదటివారంలో విచారించిన కోర్టు.. ఫిబ్రవరి 3వ తేదీకి విచారణను వాయిదా వేసింది. పైగా ఈలోపు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. హైకోర్ట్ ఆదేశాలకు లోబడి ఉండాలని కూడా స్పష్టం చేసింది.
పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో కేసు తీవ్రత దృష్ట్యా రైతులు తమ పిటిషన్ పై త్వరగా విచారించాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెక్రటేరియట్, హైకోర్ట్, అసెంబ్లీలను కేపిటల్ నోటిఫై ఏరియాల నుంచి తరలించొద్దని పలు అనుబంధ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలో.. రాజధానిపై హై పవర్ కమిటీని వేశామని జీవో కాపీని అడ్వొకేట్ జనరల్ హైకోర్ట్ ముందుంచారు. జీవోలో బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ ప్రస్తావన ఉండటంతో ఈ కమిటీ నియామకం జీవో ఏదని హైకోర్ట్ ప్రశ్నించింది. వివరాలు తన వద్ద లేవని త్వరలో ఇస్తామని ఏజీ హైకోర్టుకు చెప్పారు.
కేసు తీవ్రత దృష్ట్యా వి కేసును జనవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ ముందుకు జరిపారు. జనవరి 21వ తేదీ నాటికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పురపాలక శాఖ, సీఆర్డీఏ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. జనవరి 23వ తేదీన విచారణ చేపడతామని కూడా హైకోర్ట్ స్పష్టం చేసింది. అయితే.. జనవరి ఇరవయ్యో తేదీ లోపే.. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏపీ సర్కార్ లో ఉంది. హైకోర్టును లెక్కలోకి తీసుకోకుండా ముందుకెళ్తుందా.. ? హైకోర్టు విచారణ తర్వాతే అడుగులేస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ కమిటీల చట్టబద్ధతను నిరూపించలేకపోతే.. ఏపీ సర్కార్ కు చిక్కులు తప్పవన్న ప్రచారం న్యాయవర్గాల్లో ఉంది.