సినిమాలకు కంటెంట్‌తో పాటు క్వాలిటీ కూడా ముఖ్యమే. అందుకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధం అవుతున్నారు నిర్మాతలు. ఇక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కలిశారంటే, నోట్ల కట్టల్ని నీళ్లలా ఖర్చు చేయాల్సిందే. ‘అల.. వైకుంఠపురములో’ లాంటి సినిమాలకైతే, డబ్బులు ఖర్చు చేయడం అస్సలు పాయింటే కాదు.
అందుకే ఈసినిమాలోని ఓ పాటకు ఆరు కోట్లు ఖర్చు చేశారు. `సామజ వరగమన` అనే గీతాన్ని పారిస్ లో తెరకెక్కించారు. ఈ పాటకు అయిన ఖర్చు.. అక్షరాలా ఆరు కోట్లు. ఈ పాట లిరికల్ వీడియో యూ ట్యూబ్‌లో పెద్ద హిట్. 2019 సూపర్ హిట్ గీతాల్లో ఇదొకటి. అందుకే ఈ పాటని తెరపై కూడా అందంగా చూపించాలని తపన పడ్డాడు త్రివిక్రమ్. ఈ పాట కోసమే చిత్రబృందం ఇటలీ వెళ్లింది. నిజానికి ఫారెన్‌లో షూట్ అంటే ఖర్చు చాలా తక్కువ అవుతుంది. అక్కడ లొకేషన్ ఛార్జీలు పెద్దగా ఉండవు. సెట్లు వేయాల్సిన పనిలేదు కాబట్టి… తక్కువలో తక్కువగా ముగించేయొచ్చు. కానీ.. ఈ పాటకు మాత్రం 6 కోట్లయ్యాయి. పాటని తెరకెక్కించడానికి దర్శకుడు, నృత్య దర్శకుడు. వాళ్ల అసిసెట్లంట్లు, కెమెరామెన్, వాళ్ల అసిస్టెంట్లు, నిర్మాత వెళితే సరిపోతుంది. కానీ ఇటలీకి మాత్రం తమన్‌ని, ఎడిటర్ని కూడా తీసుకెళ్లారట. తీయాల్సిన రోజుల కంటే ఎక్కువ రోజులే అక్కడ ఉండిపోవాల్సివచ్చిందట. పాటకు 5 కోట్లయితే, టీమ్ ఖర్చు కోటి దాటిందట. అలా ఆరు కోట్లయ్యాయి. అలాగని ఆ పాటని అక్కడ పూర్తిగా ముగించుకుని వచ్చారా అంటే అదీ లేదు. కొంత ప్యాచ్ వర్క్ హైదరాబాద్‌లోనూ చేయాల్సివచ్చిందట. ఇంత ఖర్చు పెట్టింది పాట బాగా రావడానికే కదా. మరి అదెలా వచ్చిందో చూడాలి.