విదేశాల నుంచి తిరిగివచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని వివాదాన్ని టేకప్ చేశాడు. రాజధాని రగడ రగులుకున్నప్పుడు ఆయన కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాడు. మొన్నీమధ్యనే తిరిగొచ్చాడు. నిన్న పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేశాడు. కాని స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పలేదు. రాజధానిని మూడు ముక్కలు చేయొద్దన్నాడుగాని ఫలాన చోటనే రాజధాని ఉండాలని కచ్చితంగా చెప్పలేదు. రాజధాని ఎక్కడ పెట్టినా తమకు (జనసేనకు) అభ్యంతరం లేదని, కాని మొత్తం ఒక్కచోటనే ఉండాలని అన్నాడు. అన్ని ప్రతిపక్షాలు అమరాతినే రాజధానిగా కొనసాగించాలని స్పష్టంగా చెప్పగా పవన్ మాత్రం అలా చెప్పలేదు.
ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు ఇచ్చాడు. నిన్న ఆయన మాట్లాడినదాన్ని బట్టి చూస్తే ఆయన రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చాడుగాని అమరావతికి మద్దతు ఇచ్చాడా? అనే అనుమానం కలుగుతోంది. ఇక రాజధాని విషయంలో సీఎం జగన్‌కు స్పష్టత లేదన్నాడు. రాజధాని ఏదో ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశాడు. చంద్రబాబు హయాంలో ఆయన అమరావతి రాజధానిగా సమర్థించినా ఇప్పుడు మాత్రం విశాఖే రాజధాని అని క్లారిటీ ఇచ్చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాజధాని మూడు ముక్కలవుతుందని ప్లాన్డ్‌గానే ప్రకటించారు.
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలో ఉండొచ్చు, లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలో ఉండొచ్చు, జ్యుడీషిషియల్ కేపిటల్ కర్నూలులో ఉండొచ్చు అన్నారు. ఇలా ‘ఉండొచ్చు’ అనగానే ఇది ఆలోచనగా, ప్రతిపాదనగా జనం, రాజకీయ పార్టీల నాయకులు అనుకున్నారు. కాని అది ఆయన నిర్ణయమేనని ఆ తరువాత వెంటవెంటనే జరిగిన పరిణామాలు తెలియచేశాయి. అమరావతి రాజధానిగా ఉండదని చాలాసార్లు జగన్ స్పష్టంగా, ధైర్యంగా చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణాలకు డబ్బు ఖర్చు చేయడం వృథాయేనని, బూడిదలో పోసిన పన్నీరేనని చెప్పారు.
ఇది రాజధాని అమరావతిలో ఉండదని ధైర్యంగా చెప్పినట్లు కాదా? కేబినెట్ సమావేశంలోనే రాజధాని విశాఖేనని జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకు మించిన స్పష్టత ఏం కావాలి. ఎంపీ విజయసాయి రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖే రాజధాని రోజూ స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. ఇంతకంటే స్పష్టత ఏం ఉంటుంది. వీరి ప్రకటనలను, ప్రసంగాలను జగన్ ఏనాడూ ఖండించలేదు. అప్పుడే అలా మాట్లాడవద్దని అడ్డుకోలేదు. రాజధాని మార్చాలనే విషయంలో జగన్ సహా పార్టీ, ప్రభుత్వమంతా ఒక్క తాటి మీదనే ఉంది. నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా పైకిమాత్రం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడటంలేదు.
ఒకవిధంగా చెప్పాలంటే రాజధాని విషయంలో పవన్‌కే స్పష్టత లేదనుకోవాలి. రాజధాని విషయంలో జనసేన విధానమేమిటో ప్రకటించడానికి ముందు ఈ సమస్యను అధ్యయనం చేయడానికి పవన్ పదకొండుమందితో కమిటీ వేసినట్లు వార్త వచ్చింది. ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చాక పవన్ కళ్యాణ్ పార్టీ విధానం ప్రకటిస్తాడని సమాచారం. పవన్‌కు క్లారిటీ ఉంటే కమిటీ వేసి కాలయాపన చేయడమెందుకు?