పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇవ్వడం అంటే.. నోటికొచ్చినట్లు తిట్టడమేనని వైసీపీ నేతలు ఫిక్సయిపోయారు. రాజధాని గ్రామాల్లో పవన్ కల్యాణ్ జరిపిన పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన వేసిన ప్రశ్నలు.. నిజమే కదా అనిపించాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంపై ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. దాంతో.. వైసీపీ నేతలు.. పవన్ కల్యాణ్ పై తిట్ల దండకం అందుకున్నారు. నోరు పారేసుకోవడంలో… ముందుండే.. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. పవన్ కల్యాణ్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ రంగులు మార్చుకోవడానికి పనికొస్తాడు… పెళ్లాల్ని మార్చుకోవడానికి పనికొస్తాడు, రాజకీయాలకు పనికిరాడంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ మాకు చెబుతాడా అంటూ ఈసడించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఒక తిక్కలోడు..ఆ తిక్కలోడి గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని తీసిపడేశారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా.. ఏ మాత్రం తక్కువ తిట్టలేదు. పవన్ నిన్న సింగపూర్లో షూటింగ్ చేశాడు.. ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నాడని మండిపడ్డారు. రాజధాని తరలిస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని .. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం ముందుకెళ్తున్నారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అధికారం ఉందనే ఉద్దేశంతో… వైసీపీ నేతలు.. ప్రత్యర్థి పార్టీ నేతలను కనీసం గౌరవంగా కూడా చూడటం లేదు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలపై విపక్షాలు మాట్లాడితే.. తాము వ్యక్తిగతంగా దాడులు చేస్తామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. వీరి తీరు చూసి..సామాన్యులు కూడా ఇదేం తీరు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు విధానపరమైన విమర్శలు చేస్తున్నప్పటికీ.. వైసీపీ నేతలు.. ఆ దిశగా మాత్రం..కౌంటర్ ఇవ్వడం లేదు. సమాధానం లేదేమో కానీ.. వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు.