కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న తరుణంలో, పాత బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు కీలక ప్రకటన చేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ బాధ్యతల నుంచి త్వరలో తప్పుకుంటున్నా అని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలతో హుజూర్ నగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పీసీసీ బాధ్యతల వల్ల సొంత నియోజక వర్గం మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాననీ, అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నా అన్నారు. రిజైన్ చేసిన తరువాత హుజూర్ నగర్ నియోజక వర్గంపై పూర్తి దృష్టి పెడతాననీ, ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నా అని ప్రకటించారు.
పీసీసీ బాధ్యతల నుంచి ఉత్తమ్ తప్పుకోవడం అనూహ్యమైన ప్రకటన కానే కాదు. ఎందుకంటే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన తప్పుకుంటారనే కథనాలు వచ్చాయి. పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారని ఆ తరుణంలోనే వార్తలొచ్చాయి. అయితే, ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికలు కూడా రావడంతో అప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ ఎందుకని, ఆయన్నే అధినాయకత్వం కొనసాగించింది. వాస్తవానికి అంతకుముందే ఉత్తమ్ పదవీ కాలం కూడా పూర్తయింది. అయితే, ఆయన ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ బాధ్యతల్లో కొనసాగుతానంటూ హైకమాండ్ నుంచి ఆయనే పర్మిషన్ తెచ్చుకుని కొనసాగారు. కనీసం సొంత నియోజక వర్గంలోనైనా పార్టీని గెలిపించుకుని ఉంటే కొంతైనా బాగుండేది. అక్కడా ఓటమి తప్పకపోయేసరికి… పీసీసీ బాధ్యతల నుంచి ఉత్తమ్ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కెరీర్లో పార్టీపరంగా సాధించిన విజయాలంటూ ఏవీ లేవనే చెప్పాలి! వరుస ఓటములు, ఏ దశలోనూ పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడం, పెరిగిన ఆధిపత్య పోరు, సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ, గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరి వలసలు… ఇలా ఎన్నో సవాళ్ల మధ్య టి. కాంగ్రెస్ పార్టీని నెమ్మదిగా ఈడ్చుకుంటూ వచ్చారు ఉత్తమ్. ఇకపై ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉత్తమ్ ఉన్నారనీ, పార్టీ నుంచి జాతీయ స్థాయి పదవి ఆయన ఆశిస్తున్నారనీ ఈ మధ్య కథనాలు వచ్చాయి. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటా అని ప్రకటించడంతో… ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరనే చర్చ రేపట్నుంచీ తెరమీదికి మళ్లీ వస్తుంది.