ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లెక్కలు చెప్పకపోయినప్పటికీ.. జీతాల కోసం.. కూడా నెలాఖరులో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆర్థిక ఎమర్జెన్సీ అనే పదం.. ఏపీలో ఇప్పుడు తరచూ వినిపిస్తోంది. దీనికి కారణం.. లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రంలో… ముందూ వెనుకా చూసుకోకుండా.. సంక్షేమ పథకాలకు వేల కోట్లు.. వెచ్చించడమే. ఎక్కడ అప్పులు దొరికితే.. అక్కడ అప్పులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి.. నవరత్నాలను పూర్తి స్థాయిలో ఈ ఏడాదే అమలు చేయాల్సి ఉంటుంది. అరవై లక్షల మంది తల్లులకు .. జనవరి తొమ్మిదో తేదీన పదిహేను వేలు ఎకౌంట్లో వేయడం ప్రారంభించి.. ఉచిత ఇళ్ల స్థలాలు, డ్వాక్రా రుణాల మాఫీ, అరవై ఏళ్లకే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లను మరో 250 పెంచడం.. దగ్గర్నుంచి ప్రతీ నవరత్నాన్ని మళ్లీ ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంది. ఇవన్నీ అమలు చేయడానికి కనీసం లక్ష కోట్ల రూపాయలు కావాలి. కానీ ఏపీ.. ఈ ఏడాది మొదటి ఆరు నెలలకే .. పాతిక వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. ఆదాయానికి ఖర్చుకు పొంతన లేకుండా పోయింది.
ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా.. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు.. ఇలా అందరికీ కలిపి.. ప్రభుత్వానికి జీతాల బిల్లు నెలకు దాదాపుగా పది వేల కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా.. ఆంధ్రప్రదేశ్ మరో అర్జెంటీనా అయిపోతుందన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడిగే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇస్తామన్నా.. నిబంధనలు పాటించడం లేదు కూడా. ఉపాధి హామీ నిధులు రూ. పదివేల కోట్లు వాడుకునే చాన్స్ ఉన్నా.. ఇప్పటికి రూ. ఐదు వేల కోట్లతోనే సరి పెట్టారు. పోలవరానికి పైసా రాలేదు. అడగలేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. అడగలేదు. ఈ లెక్కన కేంద్రం నుంచి రూపాయి కూడా రాదు. పైగా ఈ ఏడాది.. ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులను తగ్గించడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.
అయితే ఏపీ ప్రజల ఆశలన్నీ యువ సీఎం జగన్ మీదే ఉన్నాయి. తన ఆర్థిక పరమైన తెలివి తేటలతో.. శూన్యం నుంచి మహా వ్యాపార సామ్రాజ్యాన్ని పుట్టించిన గొప్ప వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో.. తన ఐడియాలతోనే ఇంత గొప్ప సక్సెస్ సాధించానని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన తన తిరుగులేని.. కుబేర వ్యాపారవేత్తగా ఎదిగిన ఐడియాలతోనే.. .. ఏపీని కూడా… తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలుపుతారన్న భావన ప్రజల్లో ఉంది. ఈ ఏడాది ఆయన దీన్ని నిజం చేసి చూపించాల్సి ఉంది.