జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసు ఆంక్షలను కాదని.. ఆయన రాజధాని గ్రామాల్లోకి వెళ్లడాన్ని కారణంగా చూపిస్తూ… సెక్షన్ 144, 30 యాక్ట్‌ని బ్రేక్ చేశారంటూ..ఆయనపై కేసు నమోదు చేయాలని.. ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ పర్యటన ముగిసిపోయిన తర్వాతి రోజు.. పోలీసులు కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి పవన్ కల్యాణ్ పోలీసుల అనుమతి తీసుకునే రాజధాని గ్రామాలకు వెళ్లారు. ఉదయం ఆయన షెడ్యూల్ పెట్టుకున్నారు. కానీ ముఖ్యమంత్రి వస్తున్నారని.. సమయం మార్చుకోవాలని పోలీసులు సూచించడంతో.. ఆ మేరకు మార్చుకున్నారు కూడా.
అయినప్పటికీ.. ముఖ్యమంత్రి సమీక్షలో ఉన్నారని.. ఆయన సచివాలయం నుంచి వెళ్లిపోయిన తర్వాతే అనుమతిస్తామంటూ.. పవన్ కల్యాణ్ ను మందడం గ్రామంలోకి వెళ్లకుండా.. గంటసేపు కూర్చోబెట్టారు పోలీసులు. ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నట్లు గుర్తించిన పవన్ కల్యాణ్.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాలకు అడ్డం పడి.. కాలి నడకనే.. మందడం గ్రామానికి వెళ్లారు. పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా ఆటంకం కల్పించారు. అయితే.. ఎలాంటి గొడవలు జరగలేదు. ఆయన రైతుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ.. పోలీసుల వలయం ఏర్పాటు చేసినప్పటికీ.. పవన్ కల్యాణ్ రైతుల వద్దకు వెళ్లి భరోసా ఇవ్వడం.. ప్రభుత్వ పెద్దలకు నచ్చినట్లుగా లేదు. కంచె దాటినందుకు.. కేసు పెట్టరా అంటూ.. పై స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో.. పోలీసులు ఒక రోజు తర్వాత కేసు నమోదు చేయక తప్పలేదంటున్నారు. అయితే ఇలాంటి కేసులకు భయపడేది లేదని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.