తెలుగు360 రేటింగ్: 2.25/5
కేజీఎఫ్ తరవాత కన్నడ సినిమాలపై నమ్మకం పెరిగింది. వాళ్లూ భారీ బడ్జెట్లు కేటాయిస్తున్నారు. కమర్షియల్ సినిమాల్ని అన్ని హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఈమధ్య అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా… `అతడే శ్రీమన్నారాయణ`. కేజీఎఫ్‌లానే దీనికీ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. పాన్ ఇండియా టైపు ప్రచారం చేశారు. కన్నడలో ఇప్పటికే విడుదలై – మంచి వసూళ్లనే అందుకుంది. ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యింది. మరి… తెలుగు ప్రేక్షకులకు నచ్చే విషయాలు ఈ సినిమాలో ఏమున్నాయి? శ్రీమన్నారాయణుడు అలరించాడా.. లేదా?
కథ
అమరావతి పరిసరాల్లో నాటక బృందం ఓ భారీ చోరీ చేస్తుంది. ఆ నిధులన్నీ ఓ చోట రహస్యంగా దాస్తుంది. అయితే చోరీ చేసిన వాళ్లంతా మరణిస్తారు. నిధుల రహస్యం తెలిసిన ఒకే ఒక్కడు పిచ్చివాడుగా మారిపోతాడు. ఈ నిధి కోసం రెండు బృందాలు గాలిస్తుంటాయి. ఆ ప్రాంతానికి శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) పోలీస్ అధికారిగా అడుగుపెడతాడు. ఈ రెండు బృందాల మధ్య శ్రీమన్నారాయణ ఎలా నలిగిపోయాడు..? తన తెలివితేటలతో ఆ నిధి రహస్యాన్ని ఎలా బట్టబయలు చేశాడు? అనేదే కథ.
విశ్లేషణ
నిధుల వేట, వాటి కోసం రెండు ముఠాల వేట, మధ్యలో పోలీస్ అధికారి – ఈ సెటప్ మామూలుగానే ఉంది. కానీ దాన్ని ఓ కొత్త పంథాలో చూపించాడు దర్శకుడు సచిన్. దానికో కౌబోయ్ సెటప్ ఇచ్చాడు. అక్కడక్కడ ఇదో జానపద కథలా అనిపిస్తుంది. అంతలోనో కౌబోయ్ సినిమా అయిపోతుంది. మళ్లీ మూమూలు సోషల్ సినిమాలా కనిపిస్తుంటుంది. అయితే.. ఈ మార్పులు కృత్రిమంగా ఉండవు. నిజానికి ఇదో కొత్త తరహా ట్రీట్మెంట్. అభీరుల రాజ్యం, అక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నించే ఇద్దరు సోదరులు.. వాళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం… ఇవన్నీ ఈ కథకు కొత్త రంగు ఇచ్చాయి. కథానాయకుడు ప్రవేశం ఆలస్యంగా జరిగింది. అయితే ఈలోగా కథలో అసలు విషయం చెప్పేశారు. చోరీకి గురైన విలువైన నిధులు అమరావతి సమీపంలో ఎక్కడో నిక్షిప్తం అయ్యాయి.. వాటి కోసం వేట సాగబోతోందని ముందే చెప్పేశారు. స్థంభాన్ని బద్దలు కొట్టుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయిన సీన్ తెరపై సాగుతున్నప్పుడు ఆ తెరని చీల్చుకుని హీరో ఎంట్రీ ఇవ్వడం – మంచి మాసీ సీన్. కన్నడలో రక్షిత్ శెట్టి అభిమానులకు గూజ్బమ్స్ మూమెంట్. అయితే మనకు రక్షిత్ ఎవరో తెలీదు. తన సినిమాలు ఇది వరకు చూసిన అనుభవం లేదు. కాబట్టి రక్షిత్‌ని ఓ మాస్ హీరోగా, అభినవ శ్రీమన్నారాయణుడిగా జీర్ణించుకోవడం కొంత కష్టం అవుతుంది. ఆ మాట కొస్తే హీరో పాత్రని ఓన్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకోవాల్సివస్తుంది. ఆ తరవాత.. కథ మంచి రసపట్టులో సాగుతుంది. ఫైట్స్‌ని స్టైలీష్‌గా తీసే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల కామెడీ మిక్స్ చేయాలని చూశారు. దాంతో పోరాట సన్నివేశాలు సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్ వస్తుంది.
మూడు గంటల పాటు సాగిన సినిమా ఇది. ఏమాత్రం మొహమాటానికి పోకుండా ఉంటే మరో 30 నిమిషాలు ఈజీగా ట్రిమ్ చేసుకోవొచ్చు. చివర్లో నాటక ప్రహసనం అయితే మరీ నీరసంగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని మరింత పరీక్ష పెడుతుంది. కౌబోయ్ సెటప్ అసలేమాత్రం ఎక్కకపోతే మాత్రం ఇదేం సినిమా రా బాబూ… అనిపిస్తుంది. హీరోని ధీరోదాత్తుడిగా చూపిస్తూ, అతని అతి తెలివితేటల్ని హైలెట్ చేస్తూ, అసలు తనకు ఎదురే లేకుండా సాగిపోతున్నట్టు చూపించాడు దర్శకుడు. దాంతో ఇద్దరు భయంకరమైన ప్రత్యర్థులున్నా కథానాయకుడి సవాళ్లే లేకుండా పోతుంటాయి. పతాక సన్నివేశాలు కూడా సుదీర్ఘంగా సాగేవే. మొత్తానికి అక్కడక్క కొత్తగా ఉంటూ, కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తూ, మరి కొన్ని చోట్ల బోరింగ్‌కి గురి చేస్తూ నడిచిన చిత్రమిది. అర్జెంటుగా అరగంట కట్ చేయకపోతే… మన తెలుగు ప్రేక్షకులు భరించడం మరింత కష్టం.
నటీనటులు
రక్షిత్ శెట్టి నటనే అంతో, లేదంటే… ఈ పాత్ర కోసమే ఇలా వెరైటీగా నటించాలని తపన పడ్డాడో తెలీదు గానీ, తనని హీరోగా రిసీవ్ చేసుకోవడానికి మన ప్రేక్షకులు కొంత కష్టపడాలి. ఓ కమెడియన్ అర్జెంటుగా హీరో అయితే ఎలాంటి క్యారెక్టర్లు ఇస్తారో, అలాంటి పాత్ర ఇది. శాన్వి చాలా కాలం తరవాత కనిపించింది. తనది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. మిగిలినవాళ్లంతా కన్నడ నటీనటులే. వాళ్లంతా పరిచయం లేని మొహాలే.
సాంకేతిక వర్గం
సెట్లు, సీజీకి చాలా పని పడింది. ఉన్నంతలో బాగానే చేశారు. కౌబోయ్ సినిమా లుక్ తీసుకొచ్చారు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య భారీగా ఖర్చు పెట్టి మరీ తీసిన సినిమా ఇది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. పాటల్లో కూడా కథ వినిపించే ప్రయత్నం చేశారు. నేపథ్య సంగీతం మాత్రం మూడ్‌ని డిస్ట్రబ్ చేసేలానే ఉంది.
మొత్తంగా చెప్పాలంటే – `అతడే శ్రీమన్నారాయణ` మన తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించదు. రక్షిత్ శెట్టి కోసమైతే కన్నడలో అతని అభిమానులు నిరభ్యంతరంగా చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: ఇంత సాగదీత ఏల….నారాయణా!
తెలుగు360 రేటింగ్: 2.25/5