సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తనదైన ముద్ర వేశాడు. ఆ తరవాత నటుడిగా మారాడు. దర్శకుడిగా అవతారం ఎత్తాడు. బ్రోకర్ లాంటి చిత్రాలు ఆర్పీ లోని ఆలోచనా ధోరణికి అద్దం పట్టాయి. తులసీదళం తో భయపెట్టాలని చూశారు. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టారు. అలిషా పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. అన్నట్టు… ఇది కూడా థ్రిల్లర్ సినిమానే. ఈరోజుల్లో భయపెట్టే సినిమాలపై క్రేజ్ బాగా తగ్గిపోయింది. కాకపోతే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ సినిమా ద్వారా ఆర్పీ ఓ ప్రయోగం చేయబోతున్నాడు.
ఈ రోజుల్లో దాదాపుగా ప్రతీ సినిమా డాల్డీ ఎట్మాస్ సౌండ్‌తోనే రిలీజ్ అవుతోంది. కాకపోతే ఆ సౌండ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలు మాత్రం లేవు. అలీషా మాత్రం పూర్తిగా డాల్టీ ఎట్మాస్ సౌండ్ ని బేస్ చేసుకుని రాసుకున్న కథేనట. దానికి తగ్గట్టుగానే చిత్రీకరణ దశలో కూడా ఆ సౌండ్ ని దృష్టిలో ఉంచుకుని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందు కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. చిత్రీకరణ కూడా పూర్తిగా విదేశాల్లోనే. కాబట్టి సాంకేతిక నిపుణులంతా చిత్రబృందానికి అందుబాటులోనే ఉంటారు. ఈ చిత్రానికి అటు దర్శకత్వం, ఇటు సంగీత బాధ్యతలు కూడా ఆర్పీనే చూసుకుంటున్నాడు.