కేసీఆర్కు సాధ్యం కాలేదు..జగన్కు సాధ్యమయింది..! అనుభవం ఉంటే సరిపోదు.. సంకల్పం కావాలి..! కేసీఆర్ సాధ్యం కాదన్నారు.. ఆయన మాలో మరింత కసి పెంచారు..! అంటూ.. ఏపీ మంత్రి పేర్ని నాని పదే పదే .. కేసీఆర్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దీనికి కారణం… ఆర్టీసీ విలీనం. ఆర్టీసీని విలీనం చేయమని.. తెలంగాణ కార్మికులు సమ్మె చేస్తే.. కేసీఆర్ కుదరనే కుదరదని తేల్చేశారు. దీన్నే పట్టుకున్న పేర్ని.. కేసీఆర్ .. సాధ్యం కాదని చెప్పినా.. తాము చేసి చూపించామంటూ.. గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల్ని ఒకటో తేదీ నుంచి.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. దీనికి సంబంధించి సన్మానాలు చేయించుకున్నారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగా పేర్ని నాని ఖాతాలోనూ ఓ సన్మానం జరిగింది.
తనను ఆర్టీసీ కార్మికులు అభినందించారని ఉత్సాహమో.. మరో కారణమో కానీ.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనకు అనుభవం ఉంది.. సంకల్పం లేదని.. జగన్ కు అనుభవం లేకపోయినా.. సంకల్పం ఉందని.. పోల్చి.. కేసీఆర్ కన్నా.. జగనే గొప్ప అని నిర్ధారించారు. ఇప్పుడు కేసీఆర్ తో జగన్ ను పోల్చాల్సిన అవసరం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. నిజానికి ఏపీలో ఆర్టీసీ విలీనం అనేది జరగలేదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని మాత్రం… ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఆర్టీసీ ఆర్టీసీలాగే ఉంది. ఆ సంస్థ నడుస్తుంది. కార్యకలాపాలూ..బస్సులు ఆ సంస్థ పేరు మీదే తిరుగుతాయి. కానీ ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. అంత మాత్రాన వారికి జీతాలు పెరగలేదు. సౌకర్యాలు పెంచలేదు. కనీసం.. అలవెన్స్ ల గురించి కూడా గ్యారంటీ ఇవ్వలేదు. కేవలం ఉత్తర్వులిచ్చి సంబరాలు చేయించుకుంటున్నారు.
నిజానికి కేసీఆర్ ఇలాంటి విలీనం చేయదల్చుకుంటే.. ఎప్పుడో చేసేవారు. కానీ దాని వల్ల భవిష్యత్లో వచ్చే సమస్యలేమిటో.. ఒకప్పుడు రవాణా మంత్రిగా చేసిన ఆయనకు బాగా తెలుసు. అందుకే.. ఓ స్టాండ్ మీద నిలబడ్డారు. కానీ.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ.. ఆర్టీసీకి ఉద్యోగులు పని చేయడం ఏమిటనే కాన్సెప్టే .. చాలా తేడాగా ఉంది. దీన్నే గొప్పగా పేర్ని నాని చెప్పుకుంటున్నారు. భవిష్యత్లో ఆర్టీసీ విలీనంపై.. ప్రభుత్వం వేసిన అడుగు… తెచ్చి పెట్టబోయే సమస్యలను ప్రభుత్వం కూడా పరిష్కరించడం కష్టమవుతుందన్న అంచనా.. నిపుణుల్లో ఉంది. అప్పుడు.. కేసీఆర్.. ఈ మాటలన్నింటిని గుర్తు చేసి.. తన మాటల తూటాలతో కుళ్లబొడుస్తారమో చూడాలి..!