ప్రజలు డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో దోచుకున్న సొమ్మును.. రుణాల రూపంలో బడాబాబులకు ఇస్తారు. వారు.. వాటిని నిరర్థక ఆస్తులుగా మార్చేస్తారు. ఈ నిరర్థక ఆస్తులుబ బ్యాంకులకే. రుణం తీసుకున్న వారు మాత్రం… దర్జాగా వాటిని ఖర్చు పెట్టుకుంటారు. దేవుళ్లకు విరాళాలిస్తారు. నిధులు మళ్లించి వేరే ఆస్తులు కొంటారు. ఏమైనా చేస్తారు. కానీ.. రాజకీయ నేతలుగా చెలామణి అవుతూ… వాటిని చెల్లించరు. కనీసం.. శిక్షకు కూడా వారు అర్హులు కాదు. కనీసం అరెస్టుల వరకూ వెళ్లదు.
వేల కోట్ల అప్పుల్లో రాయపాటి, సుజనా సహా ఎంతో మంది..!
బ్యాంకులకు వందలు, వేల కోట్లు ఎగ్గొట్టిన ఆరోపణలు ఉన్న వారిలో రాయపాటి సాంబశివరావుపై తాజాగా సీబీఐ కేసు నమోదయింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ యూనియన్ బ్యాంక్‌కు రూ. 264 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతపై సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ ఇదొక్కటే కాదు.. ఆ కంపెనీకి.. కనీసం ఐదారువేల కోట్ల అప్పులు ఉన్నాయి. అవన్నీ తీర్చగలిగే స్థితిలో ప్రస్తుతం కంపెనీ లేదు. ఈ రుణాలు తీసుకున్నప్పుడే.. ట్రాన్స్ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు చీర, తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు 3.42 కోట్లను విరాళంగా ఇచ్చారు. వాళ్ల సొమ్ము కాదు కానీ.. పుణ్యం కోసం మాత్రం తగ్గలేదు. ఇక సుజనా చౌదరిపై లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తాను ఎవర్నీ మోసం చేయలేదని చెబుతూ ఉంటారు. రుణాలు చెల్లింపు ప్రక్రియ… సెటిల్మెంట్ ప్రక్రియ నడుస్తుందని చెబుతూంటారు. టీడీపీలో ఉన్నప్పుడు.. ఆయనపై కేసులు నమోదయ్యాయి. పలుమార్లు సోదాలు జరిగాయి.
పరిస్థితికి దర్పణం పట్టే.. రఘురామకృష్ణంరాజు దబాయింపు ..!
ఇండ్ భారత్ పవర్ అనే కంపెనీల యజమాని, నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు దాదాపుగా రూ. 3వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు. గతంలో ఓ టీవీ చానల్ కు ఓ ఇంటర్యూ ఇచ్చారు. ఆయన అప్పులకు సంబంధించినవి అడిగినప్పుడు.. చాలా తేలిగ్గా తీసుకున్నారు. ” దొబ్బెయ్రా నీకెందుకు..” అని జర్నలిస్టును గదమాయించారు. ఆ తర్వాత మొక్కుబడిగా ఆయనపై సీబీఐ కేసు నమోదయింది. ఓ సారి సోదాలు చేశారు. ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. ప్రధాని .. ఆయనను హాయ్ రాజు గారూ అని పిలిచే పలుకుబడి వచ్చింది. అందుకే ధైర్యంగా.. అప్పులు కట్టబోనని.. చెబుతున్నారని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది.
రాజకీయమే వారిని కాపాడుతోంది..! ఎవరేం చేయగలరు..?
సామాన్యులు ఎవరైనా అప్పులుంటే సిగ్గుపడతారు..! తీర్చలేకపోతే పరువుపోతుందని భయపడతారు..! ఎగ్గొట్టే ఉద్దేశం ఉంటే.. అదే అప్పు ఇచ్చినోడు.. బలహీనుడని.. ఏమీ చేయలేడని.. భావిస్తే.. ఏం చేసుకుంటావో చేస్కో అంటారు…!. వారి కన్నా.. తాము ఎక్కువ అధికారంలో ఉంటేవారేమీ చేయలేరని నిర్ణయానికొస్తారు. అందుకే.. అధికార పార్టీల్లో చేరిపోతున్నారు. కుదరకపోతే.. అధికార కేంద్రానికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తున్నారు. దాంతో బ్యాంకు అధికారులు సైలెంట్ అవుతున్నారు. ప్రజాధనం ఇలా రాజకీయ నేతల చేతుల్లో రుణాలుగా.. అవి నిరర్థక ఆస్తులుగా మారిపోతున్నాయి.