బాధితుల పక్షాన నిలవడం… అధికారానికి ఎదురొడ్డి పోరాడటం.. మీడియా ప్రధాన లక్షణం. కానీ తెలుగు మీడియాలో ఈ లక్షణం లోపించి చాలా కాలమయింది. బాధితులకు అండగా ఉండటం కంటే.. వారిని .. తమ యాజమాన్య అనుకూల పార్టీలకు విధానాలకు అనుగుణంగా కించ పర్చడం కూడా చేస్తూ.. ఇదేం మీడియా అనుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి జర్నలిజం వాతావరణంలో తనదైన ప్రత్యేకత చూపిస్తున్నారు టీవీ5 మూర్తి. అమరావతి రైతుల ఆందోళనలను ఆయన కవర్ చేస్తున్న విధానం.. పెడుతున్న చర్చ కార్యక్రమాలు.. చర్చలకు వస్తున్న బాధ్యతాయుత పార్టీల ప్రతినిధుల్ని అడుగుతున్న ప్రశ్నలు.. చాలా మందిని ఆలోచింపచేసేలా ఉంటున్నాయి. అడపాదడపా ఆయన ఆవేశంగా స్పందిస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. సమస్యపై.. ఆయనలోని జర్నలిస్టు స్పందనగా దాన్ని అర్థం చేసుకోవచ్చు.
అమరావతి సమస్యను రైతుల కోణంలోనే చూపుతున్న టీవీ5 మూర్తి..!
అమరావతి రైతుల విషయంలో.. టీవీ చానళ్లు.. టీఆర్పీల పండగ చేసుకుంటున్నాయి. వివాదాలు లేకపోతే.. సృష్టించి టీఆర్పీలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రైతుల్ని కించ పరిచి వారిని రెచ్చగొట్టి… కావాల్సిన సరుకును సృష్టించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా.. వారి వాయిస్‌ను.. చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయగలుగుతున్నారు టీవీ5 మూర్తి. ఆయన క్షేత్ర స్థాయి రిపోర్టింగ్ కు వెళ్తున్నారు. రైతులతో చర్చిస్తున్నారు. చర్చా కార్యక్రమాలు పెడుతున్నారు. మూర్తి వేస్తున్న ప్రశ్నలు.. అడుగుతున్న విధానం.. సమస్యను సృష్టించి.. పెద్దది చేస్తున్న వారికి నచ్చడం లేదు. కానీ మీడియాకు కావాల్సింది ఆ తెగువే. అలా చేసినప్పుడే.. మీడియా అనే దానికి సంపూర్ణ న్యాయం చేసినట్లు. మూర్తి అదే చేస్తున్నారు.
టీఆర్పీలు పెంచుకోవడం కన్నా.. బాధితులకు అండగా నిలవడమే ముఖ్యం..!
మూర్తి ఇలా రైతులకు అండగా నిలవడం.. వారి వాయిస్‌ను గట్టిగా వినిపించడాన్ని.. చాలా మంది.. టీడీపీకి మద్దతుగానే.. వైసీపీకి వ్యతిరేకంగానో ఊహించుకుని విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయనేంటో ఆయనకు తెలుసు కాబట్టి… వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆయన టీడీపీ కాదు.. వైసీపీ కాదు.. అంతకు మించి ఏ పార్టీ కాదు. ఆయన బాధితుల పక్షాన ఉండే నిఖార్సైన మీడియా ప్రతినిధి మాత్రమే అనుకోవచచ్చు. అందుకే.. తనపై వచ్చే విమర్శలకు ఒక్కటే సమాధానం చెబుతారు.. ఏవరేమైనా అనుకోని.. రైతులకు న్యాయం జరిగే వరకూ.. వారి పక్షాన మాట్లాడతానని చెబుతున్నారు.
నిజమైన ప్రతిపక్ష పాత్రలోకి జర్నలిజాన్ని తెచ్చిన మూర్తి ..!
సమాజంలో మీడియా ఎప్పుడూ పాలకులకు అనుకూలంగా ఉండకూడదు. యజమానుల వ్యాపార ప్రయోజనాల కోసం అసలు రాజీ పడకూడదు. అలా జరిగిపన్పుడే.. ఫోర్త్ ఎస్టేట్ విలువ నిలబడుతుంది. మూర్తి .. బాధితులకు భరోసాగా నిలబడున్న వైనం చూసి.. తమ హక్కుల కోసం పోరాడాలనుకునేవారి కాస్తంత అయినా ధైర్యం కలిగే అవకాశం ఉంది. ఇతర చానళ్లు.. రైతుల ఆందోళనలను.. ఓ ఈవెంట్ గా కవర్ చేస్తున్నాయి. పరిమితులు.. ఆదేశాలు.. యాజమాన్యం ఇష్టాలను బట్టి వారు కవర్ చేయాల్సి వస్తోంది. ఈ విషయంలో టీవీ 5 మూర్తి.. ప్రత్యేకత చూపిస్తున్నారు.