ఏపీలోని అమరాతి రైతులు, ప్రజలు ఉద్యమం చేయబట్టి రెండు వారాలు దాటుతోంది. కాని ముఖ్యమంత్రి జగన్ నుంచి ఏమాత్రం స్పందన లేదు. అమరావతి అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యవహారమని, దాంతో తనకు సంబంధం లేదని అనుకుంటున్నారా? అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నప్పటికీ, ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ఇస్తున్నప్పటికీ జగన్ ఏమాత్రం స్పందించకుండా తాపీగా ఉన్నారు. ఆయన తప్ప మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు కంటిన్యూగా మాట్లాడుతున్నారు.
అమరావతిని, అక్కడి రైతులను ప్రజలను కించపరిచేవిధంగా మాట్లాడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడంలేదు. ఒకవిధంగా చెప్పాలంటే పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎంతసేపూ అమరావతి, విశాఖపట్టణం చుట్టూనే రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడైతే సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మూడు రాజధానుల ప్రకటన చేశారో అప్పటినుంచి రాజధాని సీరియల్‌ను వైకాపా నేతలు రంజుగా నడిపిస్తున్నారు. చివరకు ఇది వైకాపా-టీడీపీ మధ్య వివాదంగా మారింది. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని వైకాపా నేతలు ఆరోపిస్తుండగా, విశాఖలో వైకాపా నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు.
రెండు పార్టీల నాయకులు దర్యాప్తు చేయండి అంటున్నారు. ఈ వివాదంలో చివరకు స్పీకర్ తమ్మినేని సీతారాం పోషిస్తున్న పాత్ర పరమ అసహ్యకరంగా మారింది. గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉన్న తమ్మినేని పక్కా వైకాపా కార్యకర్తలా మారిపోయి అవాకులు చెవాకులు పేలుతున్నారు. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్ రాజధాని వివాదం మంటల్లో రాజకీయ ప్రయోజనాలు అనే చలి కాచుకుంటున్నట్లుగా కనబడుతోంది. ఆయన ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా నోరు విప్పి ఎందుకు మాట్లాడటంలేదో అర్థం కావడంలేదు.
హైపవర్ కమిటీ రిపోర్టు వచ్చాక దాన్ని అసెంబ్లీలో పెట్టి, చర్చ జరిపి రాజధానిపై నిర్ణయం ప్రకటిస్తుండవచ్చు. అది వేరే విషయం. రాజధానిపై ఆయన సర్కారు పెట్టే తీర్మానం తప్పనిసరిగా ఆమోదం పొందుతుంది. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు వైకాపాకే ఉన్నారు కాబట్టి. వారే కాకుండా మరో ముగ్గురు అనధికార ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే ఈలోగా అమరావతిలో రెండు వారాలుగా రాత్రింబవళ్లు ఆందోళన చేస్తున్న రైతులను, సాధారణ ప్రజానీకాన్ని శాంతింపచేయాల్సిన అవసరం లేదా? రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న జగన్ ఈ విషయాన్ని వారికి వివరించాల్సిన అవసరం లేదా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న మంత్రులను, నాయకులను, స్పీకరును కట్టడి చేయాల్సిన పనిలేదా? జగన్ ఎవ్వరినీ మందలించకపోవడంతో మంత్రులు, నేతలు చెలరేగిపోతున్నారు.
బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే జగన్ పరువు పోదా? సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మొత్తం జనాభాలో పది శాతానికి మించి రాజధానితో పని ఉండదని అన్నారు. మరి అలాంటప్పుడు మూడు రాజధానులంటూ హడావుడి చేయడమెందుకు? రాజధానికి జనంతో సంబంధం లేనప్పుడు ఇప్పుడు అమరావతిలో ఉన్న వ్యవస్థ సరిపోతుంది కదా. మరో మంత్రి ‘అసలు రాజధాని మారుస్తామని ఎవరు చెప్పారు’ అంటూ మండిపడ్డాడు. అసలు ఎవరూ చెప్పకపోతే రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు? రాజధాని మార్చడంలేదని సీఎం జగన్ చెప్పొచ్చుగా.
మూడు రాజధానుల ఏర్పాటువల్ల బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందంటూ చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవంలేదు. జగన్ ముందుగా, వెంటనే చేయాల్సిన పని స్పీకర్ తమ్మినేని సహా మంత్రులందరికీ ‘నోరు మూసుకొని ఉండండి’ అంటూ మారటోరియం విధించడం. జగన్ ప్రజాక్షేమం కోరుకునే సీఎం అయితే ముందుగా ఆ పని చేయాలి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనల కారణంగానే దాదాపు ముప్పయ్ మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోనూ మంత్రులు చేస్తున్న ప్రకటనల కారణంగా అమరావతి రైతులు భయపడో, దిగులుతోనో, ఆవేశంతోనో ప్రాణాలు తీసుకుంటే అందుకు బాధ్యలు ఎవరు?