శుభారంభం.. సగం విజయం అంటారు పెద్దలు. ఓపెనింగ్ బాగుంటే – అన్నీ బాగుంటాయి. అది క్రికెట్ అయినా, సినిమా అయినా. అయితే జనవరి 1 మాత్రం టాలీవుడ్‌కి కలిసి రాలేదు. ఒకటో తేదీన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. రాంగోపాల్ వర్మ ‘అతి’ ప్రచారం తరవాత విడుదలైన బ్యూటిఫుల్… ఏ వర్గాన్నీ ఆకట్టుకోలేపోయింది. కథానాయిక తొడల్ని చూపించడంలో పెట్టిన శ్రద్ధ, కథ, కథనాలపై పెట్టలేదు. రంగీలాకు సీక్వెల్ అంటూ బిల్డప్పు ఇచ్చారు. కానీ ఆ సినిమాకీ దీనికీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా వుందని చూసినవాళ్లంతా పెదవి విరుస్తున్నారు. సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉల్లాల ఉల్లాల’ గురించి అసలు ఎవరూ పట్టించుకోలేదు.
ఇక దీంతోపాటు రెండు అనువాదాలొచ్చాయి. కన్నడ బొమ్మ `అతడే ‘శ్రీమన్నారాయణ’ ఒకటి. రక్షిత్ శెట్టి, శాన్వి జంటగా నటించిన చిత్రమిది. కౌ బోయ్ స్టైల్లో స్టైలీష్‌గా ఉంది గానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి మాత్రం ఈ సినిమా దగ్గరగా లేదు. ఏకంగా మూడు గంటల పాటు సీరియల్ ధోరణిలో సాగిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా విసిగించింది. ఇక గౌతమ్ మీనన్ ‘తూటా’ లక్ష్యానికి కిలోమీటర్ల దూరంలో పేలింది. ధనుష్ మ్యాజిక్ ఈసారి పనిచేయలేదు. బోరింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఈ మూడు సినిమాలూ ఓపెనింగ్స్ లేకుండా పోయింది. బీ, సీ సెంటర్లలో అయితే కాస్త శ్రీమన్నారాయణే బెటర్ అనిపిస్తోంది. మొత్తానికి తొలి రోజే నాలుగు ఫ్లాపుల్ని చూసింది చిత్రసీమ. ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటి జాతకం ఎలా వుందో?