తెలంగాణలో చాపకింద నీరులా విస్తరించే పనుల్లో భాజపా ఉందనేది వాస్తవం. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల్లో కొంతమంది నేతల్ని ఆకర్షించింది. ఇంతవరకూ తెరాస నుంచి ఎవర్నీ వలేసి లాగలేకపోయింది. తాము అత్యంత బలమైన పార్టీగా ఉన్నామని తెరాస ధీమా వ్యక్తం చేస్తుండటానికి కారణం కూడా అదే. అయితే, దీన్ని బ్రేక్ చేసేందుకు ఒక కొత్త వ్యూహాన్ని తెలంగాణ భాజపా నేతలు సిద్ధం చేసినట్టు సమాచారం. కొంతమంది తెరాస నేతలకు వారు టచ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆ తెరాస నేతలు ఎవరంటే… వలసల కారణంగా పార్టీలో ప్రాధాన్యత కోల్పోయామని ఫీలౌతున్నవారు, పార్టీలో కొనసాగినా భవిష్యత్తులో తమకు అవకాశాలు తెరాస ఇవ్వదు అనే నమ్మకానికి వచ్చేసినవారు! ఈ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముందుగా ప్రయోగించే పనిలో కమలదళం ఉన్నట్టు సమాచారం. ఆ జిల్లానే మొదటగా ఎందుకంటే… అక్కడే వలస నేతల దాటికి అసంతృప్తిలో ఉన్న తెరాస నాయకులు రెడీగా ఉన్నారనేది భాజపా లెక్క!
అశ్వారావుపేటలో పోటీ చేసిన తెరాస నేత తాటి వెంకటేశ్వర్లు ఓడిపోయారు, కాంగ్రెస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు… ఆ తరువాత తెరాస గూటికి చేరిపోయారు. ఇల్లందు నియోజక వర్గంలో తెరాస తరఫున కోరం కనకయ్య పోటీ చేసి ఓడిపోయారు. అయితే, కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియ… ఆ తరువాత, తెరాసలో చేరిపోయారు. పినపాకలో ఇదే పరిస్థితి! తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్రావు ఓడిపోతే, కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు గులాబీ గూటికి వెళ్లిపోయారు. ఇలా… తెరాసలో ఓటమిపాలైన ఈ ముగ్గురు నేతలూ పార్టీలో భవిష్యత్తుపై డైలమాలో ఉన్నారట. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలే నియోజక వర్గంలో హల్ చేస్తున్నారు. వారిని అనుసరించాల్సిన పరిస్థితి! వారి మాటే వినాలంటూ పార్టీ అధినాయకత్వం కూడా ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో, సొంత పార్టీలోనే ఉక్కబోతకు గురౌతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సిట్టింగులకే తెరాస టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉండటంతో… ఓడిన తెరాస నేతల పరిస్థితి ఇక అంతే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఈ పరిస్థితిని భాజపా అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ముగ్గురు నేతలూ కమలదళం టచ్ లో ఉన్నట్టు సమాచారం. తెరాసలో మనకు గుర్తింపు లేకపోయినా భాజపాలో ఉంటుందిలే అనే ధీమాతో వీరున్నట్టు సమాచారం. వీరితోపాటు తెరాసకు చెందిన ఒక మాజీ ఎంపీని కూడా భాజపా ఆకర్షించే ప్రయత్నంలో ఉందని సమాచారం. వీరందరికీ ఒకేసారి కాషాయ కండువా కప్పేస్తే… తెరాసకు గట్టి ఎదురుదెబ్బ అవుతుందనేది భాజపా వ్యూహంగా తెలుస్తోంది. వలసల పుణ్యమా అని ఇప్పటికే తెరాసలో చాలా నియోజక వర్గాల్లో ఒక ఒరలో రెండేసి కత్తులు ఇమడని పరిస్థితి ఉంది. దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే తెరాస నుంచి కూడా వలసలు పెంచుకునే అవకాశం భాజపాకి ఉంటుంది.