`మా`లో లుకలుకలు మరోసారి బయటకు వచ్చాయి. అది కూడా చిరంజీవి సాక్షిగా. `మా` డైరీ ఆవిష్కరణ కోసం చిరంజీవి వస్తే – తన ముందు రాజశేఖర్ నానా హంగామా చేశాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
`మా` డైరీ ఆవిష్కరణ ఈ రోజు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగింది. డైరీని ఆవిష్కరించిన చిరంజీవి పరిశ్రమలోని మంచి చెడ్డల్ని ప్రస్తావిస్తూ అంతా కలసి మెలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దాంతో రాజశేఖర్ వేదికపై సడన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ సమయానికి మాట్లాడుతున్న పరుచూరి వెంకటేశ్వరరావు మైకు లాక్కుని మరీ మాలో గొడవలు ఉన్నాయని, చిరు మాటలు బాగానే ఉన్నా, నిప్పులేనిదే పొగ రాదని, తాను సినిమాలు మానేసి, మా కోసం కష్టపడుతుంటే.. తనని తొక్కేయాలని చూస్తున్నారని వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దాంతో సభలో ఉన్న అందరూ అవాక్కయ్యారు. రాజశేఖర్‌ని ఎవరు ఎంత సముదాయించినా వినిపించుకోలేదు. సభా మర్యాదని పాటించకుండా – ఎవరో మాట్లాడుతున్న మైకుని రాజశేఖర్ లాక్కుని మాట్లాడం ఇదేం కొత్తకాదు. ఇది వరకు కూడా చాలాసార్లు ఇలా జరిగింది. ఇప్పుడు చిరంజీవి ముందే ఈ సీన్ రిపీట్ అయ్యింది. మైకు లాక్కుని మాట్లాడడం సభా మర్యాద కాదని, తన పెద్ద రికాన్ని గౌరవించి కాస్త నిదానంగా ఉండమని రాజశేఖర్‌కి చిరు సూచించినా ఏమాత్రం మార్పు రాలేదు. ఓ సందర్భంలో చిరు రాజశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇలాగైతే ఈ సభకు తమని ఆహ్వానించడం ఎందుకని మండిపడ్డాడు. సభకు రావడం ఇష్టం లేకపోతే రావడం మానుకోవాలని, అంతేగానీ సజావుగా సాగుతున్న సభని అభాసు పాలు చేయడం నచ్చలేదని, ఇలాంటి వాళ్లపై చర్య తీసుకోవాలని చిరంజీవి కాస్త ఘాటుగానే స్పందించారు. దాంతో ఎప్పుడూ కామ్‌గా సాగిపోయే మా డైరీ ఆవిష్కరణ సభ.. ఈసారి మాలోని రాజకీయాలకు, సినీ పరిశ్రమలోని లుకలుకలకు అద్దం పట్టినట్టు అయ్యింది.