ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో రకరకాల వాదనలు తెర మీదికి వస్తున్నాయి. రాజధానిగా అమరావతి పోతోందని కృష్ణా, గుంటూరు, ఇతర కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు బాధపడిపోతుంటే, విశాఖపట్టణం రాజధాని కాబోతోందంటూ ఉత్తరాంధ్రవాసులు తెగ ఆనందపడిపోతున్నారు. ఎటుతిరిగి రాయలసీమవాసులే దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతా? విశాఖపట్టణమా? అనేది తేల్చుకోవడానికే పోరాటం జరుగుతోంది. మొత్తం రాజధాని ఒక్కచోటనే ఉండాలని అమరావతి ప్రాంత ప్రజలు, దాన్ని సమర్థించే ఇతర జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలోనే పెట్టాలని ఉత్తరాంధ్రవారు పట్టుబడుతున్నారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే అమరావతికి ప్రాధాన్యం ఉండదని, విశాఖే అసలైన రాజధాని అవుతుందని వారికి తెలుసు. ఈ రెండు ప్రాంతల మధ్య గొడవలో రాయలసీమను ఎవరూ పట్టించుకోవడంలేదు. కర్నూలులో హైకోర్టు పెడతామని ప్రభుత్వం చెప్పింది. దాన్ని జ్యుడీషియల్ కేపిటల్‌గా నేతలు చెబుతున్నారు. కాని రాజధాని నగరానికి ఉన్న ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ హైకోర్టుకు, అది ఉన్న నగరానికి ఉండవు. రాయలసీమలోని ఏ జిల్లా నుంచైనా విశాఖ చాలా దూరమనే వాదన మొదటినుంచి వినిపస్తోంది. వైకాపా నేతలు కర్నూలులో హైకోర్టు అంటున్నారుగాని హైకోర్టు బెంచీల గురించి మాట్లాడటంలేదు.
కర్నూలులో హైకోర్టు పెట్టినంతమాత్రాన కర్నూలుగాని, సీమలోని ఇతర జిల్లాలుగాని అభివృద్ధి చెందే అవకాశంలేదని అంటున్నారు. అందుకే చాలామంది రాయలసీమ నాయకులు కర్నూలులో హైకోర్టు పెడతామన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషంగా లేరు. విశాఖవాసుల్లో, అక్కడి నేతల్లో ఉన్నంత ఆనందం కర్నూలులోగాని, రాయలసీమవాసుల్లోగాని కనబడటంలేదు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కొందరు రాయలసీమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు రాయలసీమ నేతలు కొందరు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.
జెసి దివాకర్ రెడ్డి వంటి నాయకులు తెలంగాణలో కలపాలన్నారు. అనంతపురం నాయకులు కర్నాటకలో కలపాలన్నారు. కేంద్రం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుందనే చర్చ అప్పట్లో చాలాకాలం జరిగింది. రాయలసీమను తెలంగాణలో కలిపేసి ‘రాయల్ తెలంగాణ’ ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడు మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలే కొందరు నాయకులు చేస్తున్నారు. ప్రస్తుతం సీమ నాయకులు పరిస్థితిని గమనిస్తున్నారు. తాజాగా టీడీపీ మంత్రాలయం నియోజవర్గం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి మాట్లాడుతూ తమ నియోజవర్గాన్ని కర్నాటకలో విలీనం చేయాలన్నారు.
1956 వరకు మంత్రాలయం నియోజకవర్గం బళ్లారి డివిజన్‌లో ఉండేదని, కాబట్టి మళ్లీ కర్నాటకలోనే కలపాలని అన్నారు. తమ ప్రాంతానికి విశాఖపట్టణం దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉందని, ప్రయాణానికే రెండు రోజులు పడుతుందని తిక్కారెడ్డి చెప్పారు. తమ ప్రాంత ప్రజలు విశాఖపట్టణం వెళ్లడంకంటే బెంగళూరుకు వెళ్లడం సులభంగా ఉంటుందన్నారు. విశాఖతో బాధలు పడటంకంటే బెంగళూరు హాయిగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డిమాండ్ మరింత పెరగవచ్చు. జగన్ సొంత జిల్లా కడప ప్రజలకు కూడా బెంగళూరు చాలా దగ్గర. కాబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లాల నుంచి ‘కర్నాటకలో విలీనం’ డిమాండ్ మరింత పెరగవచ్చేమో….!