సరిగ్గా మూడ్రోజులు కిందట… తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ టాపిక్ మాట్లాడొద్దని చెప్పారు. ఎప్పటికప్పుడు దీన్ని తెర మీదికి తీసుకుని రావడం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు కేసీఆర్ ఉంటారని, ఆయనే అసెంబ్లీలో ప్రకటన చేశారని కూడా చెప్పారు. కాబోయే సీఎం కేటీఆర్ అనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని ఆయన ప్రయత్నించారు. కానీ, ఈ టాపిక్ ని మళ్లీ రాజేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. వారసత్వ రాజకీయాలు ప్రతీచోటే ఉన్నవేననీ, దాన్లో తప్పేముందన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనీ, కాంగ్రెస్ భాజపాలు ఎంత ప్రయత్నించినా తెరాసను అడ్డుకోలేవన్నారు ఎర్రబెల్లి. ప్రతీ ఎన్నికల ముందు ఆపే ప్రయత్నం వాళ్లు చేస్తుంటారనీ, ఓడిపోయేటోళ్లు చేసే పనే ఇదన్నారు. రాష్ట్రమంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ లో నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారనీ, ఆమె బిడ్డ మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. ఆ లెక్కన తెరాసలో కేసీఆర్ తరువాత కేటీఆర్ అయితడు, దాన్లో తప్పేముందని ప్రశ్నించారు. అయితే, అదెప్పుడు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తాడన్నారు. కేటీఆర్ సమర్థుడనీ, ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నాడనీ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించాడనీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయన నాయకత్వంలో విజయం సాధించామన్నారు. జిల్లా పరిషత్తులు, సర్పంచ్ లు కూడా గెల్చుకున్నామన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ తీరుగా అసమర్థుడు కాదు, రాజీవ్ గాంధీ లెక్క అసమర్థుడు కాదన్నారు. కేసీఆర్ కి ఎంత సామర్థ్యం ఉందో కేటీఆర్ కి కూడా అంతే ఉందన్నారు. కాబట్టి, ఆయన తరువాత కేటీఆరే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలూ కేటీఆర్ కి ఉన్నాయని చెప్పారు.
ఓ పదిరోజుల కిందట మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇలానే మాట్లాడారు! దాని ప్రభావమే పార్టీలో మరోసారి మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల వారసత్వ చర్చ తెర మీదికి వచ్చిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. దాన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెడదామనుకుంటే… ఇప్పుడు మళ్లీ ఎర్రబెల్లి కొనసాగిస్తున్నారు. వీళ్లంతా కేటీఆర్ పట్ల వీర విధేయత ప్రదర్శించుకునే అంశంగా దీన్ని చూస్తున్నట్టున్నారు. బాగా ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్టున్నారు!