రాజశేఖర్ ఆగ్రహం ఇంకా చల్లారలేదు. `మా`పై, అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై గట్టిగా తన వాదన వినిపించి, ఈరోజు జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ సభలో రచ్చ చేసిన రాజశేఖర్.. సాయింత్రానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ లేఖని ఆయన మీడియాకు వదిలారు కూడా. ఉదయం జరిగిన వ్యవహారంపై సీరియస్ అయిన సినీ పెద్దలు రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈలోగానే రాజశేఖర్ ‘మా’కి గుడ్ బాయ్ చెప్పేశారు. ఈ పదవిని తానెందుకు వదులుకోవాల్సివస్తుందో వివరిస్తూ ఇంగ్లీషులో రెండు పేజీల లేఖ రాసి `మా`కి పంపారు. అదే లేఖ ఇప్పుడు మీడియాకీ చేరింది. మార్చిలో జరిగిన ‘మా’ ఎన్నికలలో రాజశేఖర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా గెలిచారు. ఆయన షూటింగు హడావుడిలో ఉన్నా సరే, ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగింది. గెలిచాక రాజశేఖర్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నరేష్ మా బావ అంటూ… మెచ్చుకున్నారు. కానీ ఈ ఉత్సాహం మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. నెల రోజులు తిరక్కుండానే అలకలు, లుకలుకలు మొదలయ్యాయి. చివరికి ఇప్పుడు రాజీనామా వరకూ వెళ్లిపోయింది పరిస్థితి.
రాజశేఖర్ రాజీనామా సంగతి అటుంచితే.. చేతి రాతతో బయటకు వచ్చిన లేఖలో పేర్కున్న విషయాలు చూస్తే, నరేష్‌పై ఆయనకు ఏమేరకు విబేధాలున్నాయో అర్థం అవుతోంది. నరేష్ వల్లే తాను `మా` ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ఆ లేఖలో స్పష్టంగా పేర్కున్నారు. అంతేకాదు.. నరేష్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నరేష్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సభ్యుల నిర్ణయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, అసలు ఎవరికీ విలువే ఇవ్వడం లేదని ఆ లేఖలో రాశారు రాజశేఖర్. మా సభ్యుల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, పదే పదే తప్పులు చేసుకుంటూ వస్తున్నారని, అందరూ ఓ నిర్ణయం తీసుకుంటే, దాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాల్ని అమలు చేస్తున్నారని, ఈ విషయంలో భావోద్వేగాలకు గురై, సభలో అలా మాట్లాడాల్సివచ్చిందని నరేష్ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పుకొచ్చాడు రాజశేఖర్.
ఉదయం రాజశేఖర్ వ్యవహార శైలి నచ్చక `మా` సభ్యుంతా రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావించారు. అయితే రాజశేఖర్ ఇప్పుడు హఠాత్తుగా ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడంతో – ఆ అవకాశమూ లేకుండా పోయింది. తనని ఎలాగూ పదవి నుంచి తప్పిస్తారని భావించిన రాజశేఖర్, ముందుగా తానే వదులుకున్నాడన్న మాటలూ ఇండ్రస్ట్రీలో వినిపిస్తున్నాయి.