రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు చాలా తీసుకుంటున్నా.. గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి ఎప్పుడూ సమాచారం ఇవ్వని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. హఠాత్తుగా.. రాజ్ భవన్ కు వెళ్లారు. సతీసమేతంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్.. గంట సేపు గవర్నర్ తో చర్చలు జరిపారు. ప్రధానంగా.. మూడు రాజధానుల నిర్ణయంపై.. జరుగుతున్న ఆందోళనలు.. మెర్సీ కిల్లింగ్ కు అనుమతించాలంటూ రాష్ట్రపతికి రైతులు రాసిన లేఖల అంశాలు… గవర్నర్ తో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్ని ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. జగన్ విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని పెట్టాలని అనుకుంటున్నారు.
ఆ దిశగానే గవర్నర్ కు సూచన ప్రాయంగా చెప్పారంటున్నారు. రాజధాని అమరావతిపై రెండో నివేదిక శుక్రవారం రానుంది. ఈ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇవ్వటంతో తుది నివేదిక కూడా అదే లైన్ లో ఉంటుందని తేల్చిచెబుతున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత అటు జీఎన్ రావు కమిటీ, ఇటు బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసేందుకు 15 రోజుల సమయాన్ని కూడా కేటాయించారు. దీని గురించి కూడా..గవర్నర్ కు జగన్ వివరించినట్లుగా తెలుస్తోంది.
బీసీజీ నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే దీనిపై చర్చించేందుకు జనవరి 8వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. హైపవర్ కమిటీ నివేదిక, రెండు కమిటీల రిపోర్ట్ లు, కేబినెట్ లో చర్చించిన అంశాలను జనవరి 20 లేదా రిపబ్లిక్ డే తర్వాత అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి జగన్ తీసుకెళ్లారని చెబుతున్నారు.