మహర్షి దాదాపు మూడు గంటల పాటు సాగింది. అంతకు ముందు శ్రీమంతుడుకీ నిడివి సమస్యలున్నాయి. అయితే మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు కూడా నిడివి లెక్కల ప్రకారం పెద్ద సినిమానే. కొద్ది సేపటి క్రితమే ‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యు బై ఏ సర్టిఫికెట్ అందుకుంది. 167 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. అంటే దాదాపు 2 గంటల 47 నిమిషాలు. ఇందులో 7 నిమిషాలు యాడ్స్. అంటే రెండు గంటల 40 నిమిషాల సినిమా అన్నమాట. ఈమధ్య పెద్ద సినిమాలన్నీ 160 నిమిషాలకు మించే ఉంటున్నాయి. ఈ రోజుల్లో సినిమా కాస్త లాగ్ అనిపించినా – అది సినిమాకి పెద్ద ప్రతికూలాంశంగా మారుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ రెండున్నర గంటలు మించకూడదని అనుకున్నారు. రైలు ఎపిసోడ్ 30 నిమిషాలు వచ్చింది. కశ్మీర్ సన్నివేశాలు మరో 15 నిమిషాలు సాగాయని తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, ఆయా సన్నివేశాలన్నీ బాగా వచ్చాయని అందుకే రన్ టైమ్ పెరిగిందని అంటున్నారు.
సెన్సార్ అయినప్పటికీ పోస్టరుపై రిలీజ్ డేట్ మాత్రం వేయలేదు. సాధారణంగా సెన్సార్ అయ్యాక రిలీజ్ డేట్‌తో పోస్టర్ విడుదల చేస్తుంటుంది చిత్రబృందం. సరిలేరు విషయంలో మాత్రం ‘సంక్రాంతి విడుదల’తో సరిపెట్టారు. అల వైకుంఠపురములో విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేనందున, సరిలేరు రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. బన్నీ ఫిక్సయిన వెంటనే మహేష్ సినిమా కొత్త రిలీజ్ డేట్ బయటకు వస్తుంది. అప్పటి వరకూ.. ఈ సినిమా సంక్రాంతి విడుదలనే అనుకోవాలి.