హైదరాబాద్: ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని కలిసి సంఘీభావం తెలపటానికి కిర్లంపూడి బయలుదేరిన నటుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు, రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్లను పోలీసులు రాజమండ్రి విమానాశ్రయంలోనే నిలిపేశారు. దీనిపై చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు. ఏ అరాచకం జరుగుతుందని తమను విమానాశ్రయంలోనే 154 సెక్షన్ కింద నిర్బంధించారో అర్థం కావటంలేదని అన్నారు. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తమను చూసి ఎందుకు భయపడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో అర్థం కావటంలేదని చెప్పారు. తామందరమూ బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులమేనని, కిర్లంపూడి వెళ్ళి ముద్రగడకు సామరస్యంగా సంఘీభావం తెలపటానికి వెళుతున్నామని అన్నారు. కేవలం వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి, తమ నోళ్ళు మూయించటానికి ఈ అరెస్టులు చేస్తున్నట్లు కనబడుతోందని చెప్పారు. మరోవైపు ఇటీవల ముంబాయిలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి, భుజానికి ఆ కట్టుతోనే రాజమండ్రి వచ్చారు.