ఆంధ్రా, తెలంగాణల్లో ఏ రాష్ట్రానికి ఆ ధోరణి అన్నట్టుగా భాజపా వ్యవహరిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కారును లక్ష్యంగా చేసుకుని ఇక్కడి నేతలు ఉద్యమాలూ నిరసనలూ అంటూ కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రాకి వచ్చేసరికి మూడు రాజధానుల అంశమై అక్కడి భాజపా నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆంధ్రాలో రాజధానుల అంశమై కేంద్ర వైఖరి ఏంటనేది ప్రస్తుతం కొంత చర్చనీయంగానే ఉంది. వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమే! ఇది రాష్ట్ర పరిధిలోని అంశమే. దీనిపై ఏపీ భాజపా నేతలు ఒక రకమైన వైఖరి తీసుకుంటే, కేంద్రం వైఖరి మరోలా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
రాజధానుల అంశమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేశామని చెబుతోందనీ, రెండు కాదు మూడు రాజధానులు అంటోందని కిషన్ రెడ్డి ఢిల్లీలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆ కమిటీల నివేదికలు వచ్చిన తరువాత ఏం చెయ్యగలం అనేది ఆలోచిస్తామన్నారు. ఆ తరువాతే హోం శాఖ అభిప్రాయం ఏంటనేది వెల్లడిస్తుందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా ఆ విధివిధానాలు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉందన్నారు. అయితే, ఏపీ రాజధానుల అంశమై స్పష్టమైన నిర్ణయం తీసుకోక ముందే ఏపీ భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారనీ, ఒకరి మీద ఒకరు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో కూర్చుని చర్చించి ఏంటనేది నిర్ణయిస్తామనీ, అప్పటి వరకూ రాష్ట్ర నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
కిషన్ రెడ్డి చెబితే వినే పరిస్థితిలో ఏపీ భాజపా నేతలు ఉన్నారా అనేదే ప్రశ్న? ఎందుకంటే, ఇప్పటికే వారు వైకాపా మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానిని అమ్మేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ ఏపీ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, అమరావతి రైతులకు అండగా నిలుస్తూ ఉద్యమ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఏపీ నేతల వైఖరి ఇలా ఉంటే… ఇంకా సంయమనం పాటించాలని కిషన్ రెడ్డి అంటున్నారు. అంటే, ఏపీ రాజధానుల అంశంలో జాతీయ పార్టీగా భాజపా వైఖరి వేరుగా ఉందని చెప్తున్నట్టా..?