అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. వరుసగా జగన్ 33వ వారం కూడా కోర్టుకు డుమ్మాకొట్టారు. జగన్ తరపు లాయర్ .. అత్యవసర పనుల వల్ల జగన్ రాలేకపోతున్నారని.. చెప్పి.. ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ1, ఏ2 కచ్చితంగా 10న విచారణ హాజరై తీరాల్సిందేనని ఆదేశించారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని.. సీబీఐ కోర్టు ఇచ్చన తీర్పును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రతీ వారం ఆయన ఆబ్సెంట్ పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. కేసు వాయిదా పడుతూనే ఉంది. వరుసగా 33వ వారం కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఎన్నికలు ముగిసినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ సాకు చెబుతూ.. కోర్టుకు వెళ్లడం లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేశారు కానీ.. సీబీఐ మాత్రం అసలు అంగీకరించలేదు.
చట్టం అందరికీ సమానమేనని.. వాదించి.. ఆ మేరకు సత్ఫలితాన్ని సాధించింది. అయితే.. ముఖ్యమంత్రి అయితే.. చట్టం తనకు అంత తీవ్రంగా వర్తించదని జగన్ భావిస్తున్నారేమో కానీ.. ఆయన మాత్రం… కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో విచారణ జరగడం లేదు. కేసు విచారణను జగన్ అండ్ కో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని.. సీబీఐ కోర్టులోనే ఆరోపణలు చేసింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే.. అలాగే ఉందని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. నిజానికి.. ఇలా.. కోర్టును ధిక్కరిస్తూ. ఎక్కువ కాలం ఉంటే… అటు కోర్టు కానీ.. ఇటు సీబీఐ కానీ.. సహనంతో ఉండే అవకాశాలు లేవు. చట్ట పరంగా తాము చేయాలనుకున్నవి చేస్తాయి. కోర్టు అయితే.. వారెంట్ జారీ చేయవచ్చు. సీబీఐ అయితే.. బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయవచ్చంటున్నారు. అంతే కానీ.. చూసీ చూడనట్లుగా వదిలేసే అవకాశం మాత్రం లేదనే చర్చ న్యాయవాద వర్గాలు చేస్తున్నాయి.
దీంతో అసలు జగన్ వ్యూహం ఏమిటో చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ బెయిల్ రద్దు చేస్తే.. ఆయన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. ఆయన వ్యూహాత్మకంగానే.. కోర్టు విచారణకు హాజరు కావడం లేదన్న అభిప్రాయం.. బలపడుతోంది. చట్టాన్ని ఏ మాత్రం లెక్కచేయని.. కోర్టులను ఏ మాత్రం గౌరవించని ముఖ్యమంత్రి అని.. కోర్టుకు హాజరు కాకపోవడంపై.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వచ్చే వారం.. విచారణకు హాజరు కాకపోతే.. కోర్టు ఏం చర్యలు తీసుకుంటున్నది ఆసక్తికరంగామారింది.