నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ.. తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. అప్పుడు ఆయన చేసిన ఉద్యమం అంతా.. తెలంగాణ నీళ్లు.. తెలంగాణ నిధులు.. తెలంగాణ నియామకాలు అన్నీ ఆంధ్రా వాళ్లు తీసుకుపోతున్నారనే. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ను.. ఏలూరులో ప్రారంభించిన ఆయన .. అన్ని ప్రాంతాలకు.. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ.. కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు.
జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రాతిపదిక ఏమిటని.. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలకు.. జగన్.. తెలంగాణ ఉద్యమ నినాదంతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కొందరికే మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని.. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు, అందరికీ మేలు చేసేలా..నాటి నిర్ణయాల్ని సరిదిద్దుతున్నామన చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, అవకాశాలు అందాలన్నదే.. తమ ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలకు అదే ప్రాతిపదిక అంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు.. అందరికీ నీళ్లు, నిధులు, నియామకాలు అందడం లేదని ఎందుకు అనుకుంటున్నారో కానీ.. ఆయన ప్రాంతాల వారీగా రాజకీయం చేయడానికి.. రాజధాని ఉన్న కృష్ణా, గుంటూరు ప్రాంతంపై.. అన్ని ఇతర జిల్లాలు వేలెత్తి చూసేలా చేయడానికి మాత్రం.. వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమం తరహాలో.. కొన్ని ప్రాంతాలపై.. ఇతర ప్రాంతాలను రెచ్చగొట్టే రాజకీయం జగన్ ప్రారంభించినట్లుగా అనుమానిస్తున్నారు.