ప్రభుత్వాలు నియమించే కమిటీలు.. ప్రభుత్వానికి ఏమి కావాల్సి ఉంటే..అవి రాసిస్తాయి. అలా రాసిచ్చేవారితోనే కమిటీలు ఏర్పాటు చేస్తారు. సహజంగా జరిగేది ఇదే. అలా అని ఆ కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో ఏముంటుందో.. ముందే ఏ ప్రభుత్వ పెద్ద కానీ.. అధికారులు కానీ.. మంత్రులు కానీ చెప్పరు. అలా చెబితే… ఆ కమిటీ విశ్వసనీయత ప్రశ్నార్థమవుతుంది. దాన్ని చూపించి.. నిర్ణయాలు తీసుకుంటే.. కోర్టుల్లో షాక్ తగులుతుంది. ఇదే పరిస్థితి జగన్‌కు ఎదురవుతుందని.. అంటున్నారు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. ఆయన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని నిస్సంకోచంగా ప్రకటించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా… కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశారని.. కోర్టుల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చేశారు.
జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రెండు మూడు రోజుల్లో వస్తుందనగా.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రకటించారు. విచిత్రంగా.. జీఎన్ రావు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా.. అదే తరహా నివేదిక ఇస్తుందని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విశాఖలోనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. అలాగే… బోస్టన్ గ్రూప్ కూడా.. నివేదిక ఇచ్చింది. దాంతో.. అవన్నీ.. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు రాసుకొచ్చిన కమిటీలని.. ప్రజల్లోనూ అభిప్రాయం ఏర్పడిపోయింది.
ఈ రెండు కమిటీల నివేదికలను పరిశీలించి.. ప్రభుత్వం తరపున నియమించిన హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని.. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అసలు ప్రభుత్వం చెబుతున్నదే.. ఈ రెండు కమిటీలు నివేదికల రూపంలో ఇచ్చినప్పుడు.. హైపవర్ కమిటీ మాత్రం మరో రకంగా ఎందుకు అనుకుంటుంది..? ఇవన్నీ.. కోర్టుల్లో ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా.. కమిటీలతో.. కావాల్సిన విధంగా రిపోర్టులు తెప్పించుకుని.. నిబంధనలు ఉల్లంఘించిందనే అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఐవైఆర్ చెప్పిన దాని ప్రకారం.. జగన్ కు షాక్ తప్పదేమో..?