జనసేన పార్టీకి అసెంబ్లీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అధినేత పవన్ రెండో చోట్ల ఓడిపోయినా, పార్టీ రాష్ట్రం మొత్తం మీద తుడిచిపెట్టుకుపోయినా ఒకే ఒక్క అభ్యర్థి రాపాక గెలిచినందుకు ఆ పార్టీ నాయకులు ఎంతో సంతోషించారు. అసెంబ్లీలో జనసేన వాణి వినిపించేందుకు ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నాడని ఆనందపడ్డారు. పవన్ కూడా ఓటమి బాధను దిగమింగుకొని ఈ ఎన్నికల్లో ఒక్కడు గెలిచినా వచ్చే ఎన్నికల్లో వందమంది గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాడు. కాని రాపాక వరప్రసాద్ బడ్జెటు సమావేశాల్లో తన ముసుగు తీసేశాడు. తాను ప్రత్యక్షంగా జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ పరోక్షంగా వైకాపా ఎమ్మెల్యేనని సూచనప్రాయంగా చెప్పాడు.
ఇదేంటి ఇలా చేస్తున్నాడు? అని జనం అనుకున్నారు. కాని రానురాను తన అసలు స్వరూపం బయటపెడుతూ వచ్చాడు. కొంతకాలం కిందట జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జనసేన బట్టలు పబ్లిగ్గానే విప్పేశాడు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి తన భవిష్యత్తు చూసుకోవాలని, జనసేనలో తనకు భవిష్యత్తు లేదని స్పష్టంగా చెప్పేశాడు. జనసేనలో తనకు భవిష్యత్తు లేదంటున్న ఈయన అందుకు చెప్పిన కారణం విచిత్రంగా ఉంది. అధినేత పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, ఆయనకు ఆ కోరిక ఉంటేనే తనలాంటివారు పార్టీలో ఉంటారని రాపాక చెప్పాడు. ‘ఇది భవిష్యత్తు లేని పార్టీలా ఉంది’ అన్నాడు. సీఎం కావాలనే కోరికతో పవన్ కళ్యాణ్ ముందుకు నడవాలని సలహా ఇచ్చాడు.
కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన రైతు సౌభాగ్య దీక్షకు రాలేనని ముందుగానే చెప్పానన్నాడు. తాను జగన్‌కు అనుకూలమని స్పష్టం చేసేశాడు. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ ఇవ్వరని, అనుకూలంగా మాట్లాడితేనే ఇస్తారని అన్నాడు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అందుకు వ్యతిరేకంగా మాట్లాడటం తనవల్ల కాదన్నాడు. రాపాక ముసుగులో గుద్దులాటకు స్వస్తి చెప్పి తన మార్గమేమిటో పవన్‌కు తెలియబరిచాడు. ఎన్నికలు ముగిసినప్పటినుంచే రాపాక వైకాపా వైపు చూస్తున్నాడని అర్థమమవుతోంది. పవన్ ఓ పక్క జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతుండగా, రాపాక జగన్‌కు జేజేలు కొడుతూ ఆయన విధానాలను పూర్తిగా సమర్ధిస్తున్నాడు. బయట ఒక రకంగా మాట్లాడుతున్న ఈ ఎమ్మెల్యే అసెంబ్లీలో మరో రకంగా మాట్లాడుతున్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా రాపాక ఇది బ్రహ్మాండమైన విధానమంటూ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. పవన్ చేపట్టిన ‘మన నది-మన నుడి’ కార్యక్రమం గురించి అసెంబ్లీలో ఒక్క ముక్కా మాట్లాడలేదు. జనసేనకు పార్టీ నిర్మాణం లేదని విమర్శించిన రాపాక ఈ విషయంలో తనకు, పవన్‌కు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్పాడు. ఇక కొన్ని రోజులుగా మూడు రాజధానులు పై అమరావతి ప్రాంతం రగిలిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఉద్యమం ఉధృతంగా సాగుతుండగానే జీఎన్‌రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదిక ప్రభుత్వానికి అందాయి. హైపవర్ కమిటీ నివేదిక రావల్సివుంది. ఈ దశలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తనకు ఉన్న సంబంధాలపై ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
ఏం క్లారిటీ ఇచ్చాడు? తనకు, పవన్‌కు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని చెప్పాడా? పవన్‌కు, తనకు మధ్య విభేదాలున్నాయని మీడియా ప్రచారం చేస్తోందని చెప్పాడా? అలా ఎందుకు చెబుతాడులెండి. ఆయన ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే…తనకు జనసేనతో, పవన్‌తో ఇక సంబంధం లేదని స్పష్టం చేశాడు. ‘నాకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యం’ అన్నాడు. రాజధాని విషయంలో పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నాడు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నాడు. పవన్ అన్నయ్య చిరంజీవి కూడా మూడు రాజధానులను సమర్థించాడని చెప్పాడు. పవన్ మూడు రాజధానులను వ్యతిరేకించలేదని చెప్పిన రాపాక రాజధాని ఎక్కడ పెడతారో స్పష్టం చేయాలని కోరాడుగాని మూడు రాజధానులు పవన్ వద్దనలేదన్నాడు. అసలు సామాన్యులకు రాజధానితో పనే ఉండదని ముక్తాయింపు ఇచ్చాడు జనసేన ఏకైక ఎమ్మెల్యే.