పొరపాట్లకు ఛాన్స్ లేదు. ఎక్కడ తేడా వచ్చినా ఊరుకునేది లేదు. తప్పు ఎవ్వరు చేసినా క్షమించే ప్రసక్తి లేదు! తెరాస నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇలానే ఉందని సమాచారం. మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో జరిగిన తెరాస విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఇలా స్పందించారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మీ పదవి పోవడం ఖాయమంటూ మంత్రులందరినీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి అసంతృప్తులూ ఉండకూడదనీ, ఒకసారి అభ్యర్థుల జాబితాను పార్టీ ప్రకటించాక ఎవ్వరూ మాట్లాడకూడదనీ, ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచే రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు!
ఎన్నికల బాధ్యతల్ని ఎమ్మెల్యేలకే కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతోపాటు, అసంతృప్తుల బుజ్జగింపులు కూడా వారే చెయ్యాలని చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో తెరాసకు పూర్తి సానుకూల వాతావరణం ఉందనీ, భాజపాగానీ కాంగ్రెస్ పార్టీగానీ పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేవని నేతలతో కేసీఆర్ చెప్పారు. తెరాస ప్రభుత్వం ఇంతవరకూ చేసిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లూ అన్నీ గెలవాలనీ… ఎక్కడ ఓడినా ఆ సంబంధింత ప్రాంతానికి చెందిన మంత్రికి పదవి ఊడటం ఖాయమని హెచ్చరించినట్టు తెలుస్తోంది.ఎమ్మెల్యేలంతా సొంత నియోజక వర్గాలకు వెళ్లాలనీ, పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన కేడర్ తోపాటు, మొదట్నుంచీ ఉన్న తెరాస కేడర్ కీ మధ్య విభేదాలున్నాయని తెలిసిందే. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో వలస ఎమ్మెల్యేలు, స్థానిక తెరాస నేతల మధ్య విభేదాలు తెరమీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమావేశాలు ఎంతవరకూ పనిచేస్తాయో చూడాలి. ఇంకోటి… లోక్ సభ ఎన్నికల్ని సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు లైట్ గా తీసుకోవడం వల్లనే సారు కారు పదహారు ఎంపీ స్థానాలు అనే కల సాకారం కాలేదన్న విశ్లేషణలు అప్పట్లో జరిగాయి. అలాంటి నిర్లక్ష్య ధోరణి మరోసారి నాయకులకు రాకూడదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ వల్ల అర్థమౌతున్నది ఏంటంటే… ఒకటీ, ఈ స్థాయిలో క్లాస్ తీసుకుంటే తప్ప తెరాస నేతలు చక్కగా పనిచేయరనే పరిస్థితి ఇప్పుడుందని చెప్తున్నట్టయింది. రెండోది… ఎంత కాదనుకున్నా ప్రతిపక్షాలు కూడా కొంత గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉందన్న అంచనాలు కూడా సీఎంకి ఉన్నట్టున్నాయనే అనిపిస్తోంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల్ని అత్యంత పకడ్బందీగా ఎదుర్కొనేందుకు తెరాస సిద్ధమౌతోంది.