ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ..ఆంధ్రప్రదేశ్ పని అయిపోయిందని తేల్చారు. ప్రభుత్వంపై.. పెట్టుబడిదారుల్లో… వ్యాపారుల్లో… ప్రజల్లో ఉన్న విశ్వసనీయత మొత్తం పోయిందని తేల్చేశారు. నష్టం వైసీపీకి కాదని.. నేరుగా ఏపీకి.. ప్రజలకేనని నిర్ధారించారు. ప్రతీ వారం… తన పత్రికలో కొత్తపలుకు పేరుతో రాసే వారాంతపు ఆర్టికల్లో… నిస్తేజంగా మారిపోయిన.. ఏపీ సమాజాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఏపీని ఆర్థికపరంగా దివాలా ముంగిట ఉన్న ప్రభుత్వ చేష్టలను…గతంలో స్వయం ప్రకటిత మేధావులుగా ప్రకటించుకున్న వారు కూడా.. మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతిమంగా.. ఏపీ ఇప్పటికైనా బతికి బయటపడాలంటే.. ఒకే ఒక్క ఆప్షన్ ఉందని తన వ్యాసంలో చెప్పుకొచ్చారు.
తమిళనాడులో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న శశికళను.. జైలుకు పంపి… బీజేపీ అగ్రనాయకత్వం..అక్కడ అడ్డుకున్నట్లే… ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు పంపడం మాత్రమే.. ఆ సొల్యూషన్ అని చెప్పకనే చెప్పారు. జగన్ బెయిల్ రద్దు చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో కూడా ఆర్కే వివరించారు. అందులో మొదటిది.. అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికీ.. పెద్ద పెద్ద పోస్టులు కట్టబెట్టడం. సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తున్నారన్న కారణంగా.. సీబీఐ సుప్రీంకోర్టుకు వెళితే.. బెయిల్ రద్దయిపోతుందని.. న్యాయనిపుణులు చెబుతున్న మాట అని ఆర్కే చెబుతున్నారు. అలాగే.. కోర్టుల్ని లెక్క చేయకపోవడం.. బెయిల్ షరతులు ఉల్లంఘించడం వంటివన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. ఓ రకంగా తన ఆర్టికల్లో.. ఆర్కే ఇదే విషయాన్ని బీజేపీ దృష్టికి తీసుకెళ్లారని అనుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి తీరుపై “కొన్ని బతులుకింతే”.. అని.. ఈసడించారు.. ఆర్కే. ఆశ.. అత్యాశలతో అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా.. తాను అనుభవించలేకపోతున్నారని.. జగన్ ఇళ్ల గురించి చెబుతూ.. వ్యాఖ్యానించారు. బెంగళూరు ప్యాలెస్..లోటస్ పాండ్ ప్యాలెస్.. అమరావతి ప్యాలెస్ ల గురించి చెప్పారు. ఇప్పుడు విశాఖలో మరో ప్యాలెస్ కట్టుకోనున్నారని.. అక్కడైనా ఆయన ఉంటారని గ్యారంటీ ఏమిటని.. ప్రశ్నించారు. మొత్తానికి.. రాజధాని వ్యవహారంలో ఆర్కేకు కనిపించిన పరిష్కారం.. జగన్ జైలుకు వెళ్లడమే.