పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ దాదాపు పింక్‌తో అన్నది ఖాయమైపోయినట్టే. 2020 ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. హిందీ, తమిళంలో హిట్టయిన సినిమా ఇది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. అయితే తెలుగులో సంభాషణల్ని త్రివిక్రమ్ అందిస్తారని, ఆయన ఈ సినిమా స్క్రిప్టుని కూడా పూర్తి చేశారని చెప్పుకున్నారు. అల వైకుంఠపురములో పూర్తయ్యాక.. ఈ స్క్రిప్టుపై మళ్లీ త్రివిక్రమ్ కూర్చుంటారని, సంభాషణలు కూడా పూర్తి చేసి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకీ త్రివిక్రమ్‌కీ ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ఈ స్క్రిప్టు ని తెలుగీకరించే బాధ్యత ఆయన తీసుకోవడం లేదు. అదంతా వేణు శ్రీరామ్ చేతుల్లోనే ఉంది. ఇప్పటికే వేణు శ్రీరామ్ కూడా తెలుగు స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారని, డైలాగులు కూడా రాసేసుకున్నారని తెలుస్తోంది. పవన్‌కి ఫైనల్ నేరేషన్ ఇస్తే సరిపోతుంది. ఇలాంటి సినిమాకి త్రివిక్రమ్ డైలాగులు అందిస్తే బాగుండేది. సినిమాకి కూడా అది కలిసొచ్చేది. త్రివిక్రమ్‌ని దిల్‌రాజు తెలుగులో డైలాగులు రాయమని అడిగారా, లేదంటే అసలు ఆ ఉద్దేశ్యాలే ఎవరికీ లేవా? అన్నది తెలియడం లేదు. అలాంటప్పుడు ఈ వార్త బయటకు ఎలా వచ్చిందో..??