మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది! మళ్లీ ఇదే మాట మరోసారి ఇప్పుడు తెరమీదికి వచ్చింది. మళ్లీ మరో మంత్రి మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. యువనేత కేటీఆర్ సీఎం అయితే బాగుంటుందనీ, ఆ నిర్ణయాన్ని నూటికి నూరుశాతం తాను స్వాగతిస్తున్నా అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. తండ్రి కేసీఆర్ కి తగ్గ కుమారుడు మా కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆయన వల్లనే పట్టాభివృద్ధి మరింత వృద్ధి చెందుతోందని మెచ్చుకున్నారు. పారిశ్రామికంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందడానికి కారణం కేటీఆర్ చేస్తున్న అవిశ్రాంత కృషే అన్నారు! ఆయన ప్రయత్నించడం వల్లనే తెలంగాణకి చాలా పరిశ్రమలు వచ్చాయన్నారు! దేశంలో ఐటీ రంగంలో హైదరాబాద్ నంబర్ వన్ గా ఉందనీ, దానికి కారణం ఆయనే అంటూ కొప్పుల మెచ్చుకున్నారు.
తెలంగాణకు యువ నాయకత్వం అవసరం ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతిపాదన ఎప్పుడు పెట్టినా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఈ టెర్మ్ లోగానీ, లేదంటే వచ్చే టెర్మ్ లోగానీ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉంటే బాగుంటుందనీ, ఆ దిశగా పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలతో ఇప్పటికి ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినవారిలో ఉన్నారు. అయితే, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని వీరంటున్నారుగానీ… ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ సంగతి ఏంటనేది ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఆ పాయింట్ మీద కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కొప్పుల ఈశ్వర్.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించాల్సినవి సాధించారన్నారు! తెలంగాణ ఏర్పాటు చేశాక ఆయన ఏవైతే అనుకున్నారో అవన్నీ చేశారని మెచ్చుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్.. ఇవే సమస్యలుగా ఉండేవనీ, ఇవన్నీ కేసీఆర్ నెరవేర్చారన్నారు. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణను నిలబెట్టే విధంగా ఆయన కృషి చేశారంటూ మెచ్చుకున్నారు. అయితే… ఈ సందర్భంలో ఇవి కేసీఆర్ ని మెచ్చుకుంటూ చెప్పిన మాటల్లా వినిపించడం లేదు! ఆయన చెయ్యాల్సింది చేసేశారు, ఇక కేటీఆర్ కి పగ్గాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందని అన్యాపదేశంగా చెప్తున్నట్టుంది. రాష్ట్రానికి యువ నాయకత్వం అవసరం అంటే దాని అర్థమేంటి? మొత్తానికి, కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అలాంటిదేం లేదని కేటీఆర్ స్వయంగా చెబుతున్నా… మంత్రులు ఆగడం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి?