కమర్షియల్ వంట ఎలా వండాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసని.. అతని గత సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. తనకి ఓ స్టార్ దొరికితే ఎలా ఉంటుందో చెప్పడానికి – `సరిలేరు నీకెవ్వరు` ఉదాహరణగా నిలవబోతోంది. ఈ సంక్రాంతి రేసులో ఉన్న సినిమా సరిలేరు నీకెవ్వరు. టీజర్‌తోనే ఈ సినిమా స్థాయి ఏంటో చెప్పేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ట్రైలర్ దించాడు. 2. 25 నిమిషాల ట్రైలర్ ఇది. మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా, కమర్షియల్ సినిమా మోత మోగినట్టుగా ఈ ట్రైలర్‌ని కట్ చేశాడు అనిల్ రావిపూడి.
ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్‌కి కీలక భాగమని, దాదాపు 30 నిమిషాల పాటు ఆ ఎపిసోడ్ సాగుతుందని ముందే తెలిసిపోయింది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్లో సింహభాగం ట్రైన్ ఎపిసోడ్ ఆక్రమించింది. ఈ సినిమాలో ఫన్ రైడ్‌గా సాగబోతోందన్న విషయం ట్రైలర్లో చెప్పకనే చెప్పారు. హీరో – హీరోయిన్ల మధ్య జరిగే రొమాంటిక్ ట్రాక్‌కి ఈ ఎపిసోడ్‌ని వాడుకున్నారు. నెవ్వర్ బిఫోర్ – నెవ్వర్ ఆఫ్టర్ అనే ఊతపదం ఈ ట్రైలర్లో రెండు సార్లు వినిపించింది. మహేష్ నోట – ఆ మాట భలే పేలింది. ఎఫ్ 2లో వెంకటేష్ లుంగీ గెటప్‌లో ఓ డైలాగ్ చెప్పి నవ్వించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మూడ్‌ని మళ్లీ ఈ సినిమాలో రిపీట్ చేశాడు అనిల్ రావిపూడి. ట్రైన్ ఎసిసోడ్ అయ్యాక… కథ కర్నూలుకి చేరింది. అక్కడ ప్రకాజ్‌రాజ్ విలనిజం, విజయశాంతి ఎపిసోడ్లు.. వాళ్లకు అండగా మహేష్ నిలబడడం ఇలా.. సినిమా స్క్రీన్ ప్లేని ఈ ట్రైలర్లోనూ ఫాలో అయ్యారు
“చూట్టూ వందమంది.. మధ్యలో వాడొక్కడే. టచ్ చేయండి. ఎవడైనా టచ్ చేయండ్రా చూద్దాం“ అంటూ విజయశాంతితో ఓ రొటీన్ డైలాగ్ పలికించారు. చివర్లో మహేష్ “చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తరవాత బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం“ అంటూ చెప్పడం హైలెల్గా నిలస్తుంది. ట్రైలర్ కి ఎండ్ కార్డులో మహేష్ లుంగీ కట్టు మరోసారి కనిపించింది. ఆ మాస్ లుక్‌కి థియేటర్లో ఫ్యాన్స్ ఫిదా అయిపోవడం ఖాయం.
మొత్తానికి ట్రైలర్‌ని మహేష్ అభిమానులకు నచ్చేలా కట్ చేశాడు అనిల్ రావిపూడి. ఇక థియేటర్లో బొమ్మ ఏ స్థాయిలో దద్దరిల్లుతుందో చూడాలి.