తెలుగు చిత్రసీమలో ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు చేసిన నటుడు కృష్ణ. ఆయన్ని ప్రభుత్వం తగు రీతిలో సత్కరించలేదన్న విమర్శ ఉంది. దాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేశారు. దక్షిణాదిన అత్యంత సీనియర్ నటులలో కృష్ణ ముందుంటారని, తెలుగు చిత్రసీమకు ఆయన ఎంతో చేశారని, అయితే ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని అభిప్రాయ పడ్డారు చిరంజీవి. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి, సత్కరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఈ మేరకు రెండు తెలుగు ప్రభుత్వాలూ పూనుకోవాలని పిలుపు నిచ్చారు. కృష్ణకు దాదాసాహెబ్ పాల్కే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే దక్కితే, అది ఆయనకు కాదని, తెలుగువాళ్లందరికీ గర్వకారణమని చెప్పుకొచ్చాడు చిరు.
తెలుగు సినిమా విషయంలో కృష్ణ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. తొలి కౌబోయ్ చిత్రం, తొలి ఈస్ట్ మన్ కలర్, తొలి కలర్, తొలి 70 ఎం.ఎమ్.. ఇలా ప్రతీ విషయంలోనూ కృష్ణ ముందున్నారు. కథానాయకుడిగానే కాదు, నిర్మాతగా, స్టూడియో అధినేతగా సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ సత్కారాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆయనకు దాదా సాహెబ్ ఇవ్వాలన్నది చిరు డిమాండ్. అది న్యాయంగానే ఉంది. మరి రెండు తెలుగు ప్రభుత్వాలూ కేంద్రానికి సిఫార్సు చేస్తే ఇదేమంత కష్టం కాదు. మరి ఇప్పటికైనా ముందడుగు వేస్తాయేమో చూడాలి.