నగరి ఎమ్మెల్యే రోజాకు నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లనే సమన్వయం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయ భవనానికి శంకుస్థాపన చేద్దామని.. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలోకి వెళ్లబోతే.. జనం అడ్డుపడి.. తమ గ్రామంలోకి రావొద్దని.. గొడవ చేశారు. ఇంతా చేసి.. వాళ్లు టీడీపీ వాళ్లా.. అంటే కాదు.. వైసీపీ వాళ్లే. జగన్ సీఎం కావాలని.. ఇంటిటికి తిరిగిన వాళ్లే. వీరి తీరు చూసి రోజా కూడా అసహనానికి గురయ్యారు. కావాలని గొడవ చేశారని.. తన కారు అద్దాలు బద్దలు కొట్టబోయారని.. ఆరోపణలు గుప్పించారు. వైసీపీ నేతలే.. ఇలా రోజాపై తిరుగుబాటు చేయడానికి కారణం.. ప్రభుత్వ పథకాలు.. పనులు.. సాయం.. లాంటివేమీ ఆశించినంతగా అందకపోవడమే.
వైసీపీ అధికారంలోకి రాక ముందు.. రోజా.. మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నామని చెప్పి.. ఏ పనులూ చేయకుండా తప్పించుకున్నారు. ప్రభుత్వం మనది కాదని చెబుతూ వచ్చారు. దాంతో ప్రజలు కూడా.. మన ప్రభుత్వం వచ్చాక మనకు మంచి చేస్తుంది కదా.. అని ఐదేళ్లు ఎదురు చూశారు. తీరా.. “మన ప్రభుత్వం” వచ్చింది కదా అని వివిధ గ్రామాల ప్రజలు రోజా వద్దకు వెళ్తే.. ఒక్క పనీ కావడం లేదు. కనీసం ప్రభుత్వ పథకాల్లో తమ పేర్లు కూడా చేర్చలేకపోతున్నారు. అదే సమయంలో.. ఆయా గ్రామాల్లో కొంత మంది టీడీపీ నేతలకు పనులు అవుతున్నాయన్న అనుమానం కూడా వారికి వచ్చింది. కొంత మంది టీడీపీ నేతలకు.. బిల్లులు రావడం.. పనులు జరుగుతూండటంతో.. వారిలో అసహనం ప్రారంభమయింది. అది రోజాను అడ్డుకునేవరకూ వెళ్లింది.
ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. పార్టీ నేతలెవరికీ.. ఏ పనులు చేయకపోయినా.. అడిగేవారు ఉండరు. ఎందుకంటే.. అధికారం లేదు కదా అని వారు సర్దుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందర్నీ సర్దుబాటు చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి ఇప్పుడు రోజాకు ఎదురవుతోంది. నగరి నియోజకవర్గంలో వైసీపీ ఓటర్లలోనే.. రోజాకు అనుకూలం.. రోజాకు వ్యతిరేకం అంటూ మారిపోయారు.