ఏ టైపు ఎన్నికలైనా సరే పొత్తుల ప్రస్తావన లేకుండా ఉండదు. ఏ పార్టీ అయినా సరే ఎన్నికలొస్తే పొత్తుల విషయం మాట్లాడకుండా ఉండదు. పార్టీలకు మితిమీరిన బలం, ప్రజాదరణ ఉంటే తప్ప పొత్తులు పెట్టుకోకుండా బరిలోకి దిగడం అసాధ్యంగా మారింది. ఒకప్పుడు జాతీయ పార్టీలు పొత్తులు లేకుండా బరిలోకి దిగాయి. కాని ఈ కాలంలో అది సాధ్యం కావడంలేదు. జాతీయ పార్టీలు సైతం పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీల కాళ్ల దగ్గరకు వస్తున్నాయి. పాత శతృత్వాలు మర్చిపోయి పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. తప్పడంలేదు మరి. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, టీడీపీ, కోదండరామ్ పార్టీ టీజెఎస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. సహజంగానే అధికార టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి ఘనవిజయం సాధించింది.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలొచ్చాయి. అధికార టీఆర్ఎస్కు పొత్తుల అవసరం ఉండదు కదా. బీజేపీకి కూడా పొత్తులు లేవు. ఇక కాంగ్రెసు పార్టీకి తప్పనిసరిగా పొత్తులు అవసరం. ఈ పార్టీలో రాష్ట్ర నాయకత్వం ఏం చేయాలన్నా ఢిల్లీలోని హైకమాండ్ ఆదేశాలు ఇవ్వాల్సిందే కదా. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. టీఆర్ఎస్, బీజేపీ తప్ప ఇతర ఏ పార్టీలతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. టీఆర్ఎస్తో ఎలా పెట్టుకుంటారులెండి. కాంగ్రెస్సే తమ ప్రధాన ప్రత్యర్థని ఈమధ్య మంత్రి కేటీఆర్ కూడా చెప్పాడు. దాన్ని తాము తక్కువగా అంచనా వేయడంలేదన్నాడు.
ఇక బీజేపీని కాంగ్రెసు జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తోంది కాబట్టి దాంతో పొత్తు ప్రసక్తే ఉండదు. మిగిలింది టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కోదండరామ్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయబోతున్నాయో ఇప్పటివరకు తెలియదు. ఇక మిగిలింది టీడీపీ, టీజెఎస్. కోదండరామ్ పార్టీ అభిప్రాయం కూడా ఇంకా తెలియలేదు. కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ఉత్సాహంగా ఉందని ఈమధ్యనే వార్తలొచ్చాయి. గతంలో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఈసారి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. కొన్నిరోజుల కిందట హైదరాబాదుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ‘గెలుపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పోరాడాలి’ అని నేతలకు దిశానిర్దేశం చేశారు.
గెలుపే లక్ష్యంగా ఉండాలి. కాని టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే అది అసాధ్యం. కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేసినా అంతో ఇంతో ఫలితాలు సాధించగలదు. కాని టీడీపీకి కుదరదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొని రెండు స్థానాలు సాధించింది. ఈసారి కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒకటో రెండో మున్సిపాలిటీలు గెలుచుకోవచ్చని నాయకులు అనుకోవచ్చు. టీడీపీతో పొత్తు ఉంటే అనుకున్నదానికంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కాంగ్రెసు భావించవచ్చు. టీడీపీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అసలు పోటీయే చేయలేదు.
ఆ తరువాత హుజూర్నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసి సోదిలోకి లేకుండాపోయింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అర్హత కలిగినవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుతో, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న (కూటమి) బాబు మున్సిపల్ ఎన్నికల్లో అలాంటిది ఉంటుందని చెప్పలేదు. కాని కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కాంగ్రెసుతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు సమాచారం ఇదివరకే వచ్చింది. టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట) కాంగ్రెసు నాయకుడు రేవంత్ రెడ్డితో ప్రాథమికంగా చర్చలు జరిపారు.
ఈ విషయాన్ని మెచ్చా నాగేశ్వరరావు ధ్రువీకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెసు కలిసి పోటీ చేయాల్సిన అవసరముందని మెచ్చా అన్నారు. ఇప్పుడు పొత్తులకు కాంగ్రెసు అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర నాయకత్వం అధికారికంగా, సీరియస్‌గా టీడీపీతో చర్చలు జరుపుతుందేమో. అవసరమైతే సీపీఎం, సీపీఐలను కలుపుకువెళ్లాలని రేవంత్ రెడ్డికి మెచ్చా చెప్పారు. అంటే మళ్లీ ఒక కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ను ఢీకొట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి కూటమిగా ఏర్పడటానికి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు సుముఖంగా ఉండాలి కదా.