తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారు. రానురానూ తమకు ప్రాధాన్యత తగ్గిపోతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, ఈ వాదన ఎప్పట్నుంచో ఉన్నదే. కీలక పదవులు తమకు దక్కడం లేదన్న గుర్రుతో రగులుతూనే ఉన్నారు. ఈ మధ్య పీసీసీ అధ్యక్ష పీఠం ఖాళీ కావడంతో దాదాపు సీనియర్లందరూ రేసులో ఉన్నామంటూ ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్లు… ఇప్పుడు నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా మీదే ఫైర్ అయిపోయారు! ఆరేళ్లలో తెలంగాణలో మన పార్టీ ఏం సాధించిందో చెప్పాలంటూ ఆయన్నే ప్రశ్నించినట్టు సమాచారం! ఇలా ప్రశ్నించినవారిలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, వీ హన్మంతరావు ఉన్నారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడిలో కాంగ్రెస్ ఉంది. నేతలంతా కష్టపడి పనిచేసి, ఈ ఎన్నికల్లో పట్టు నిరూపించుకోవాలని అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తూ, మున్సిపల్, కార్పొరేషన్లకు పార్టీ ఇన్ ఛార్జ్ లుగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నియామకాలే సీనియర్ల ఆగ్రహానికి ఇప్పుడు కారణమైంది. హైదరాబాద్ లో ఒక హోటల్లో ఉన్న కుంతియాని కలిసి… సీనియర్లను ఇన్ ఛార్జులుగా నియమిస్తున్నప్పుడు, వారికి అనుకూలమైన స్థానాల్లో బాధ్యతలు ఇవ్వాలిగానీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడమేంటని కుంతియాపై ఆ ముగ్గురూ ఆగ్రహించినట్టు సమాచారం. తామంతా రాష్ట్ర స్థాయి నాయకులమనీ, కార్పొరేషన్ కి పరిమితం చేస్తారా అంటూ మండిపడ్డట్టు తెలుస్తోంది. పార్టీ బాగు కోసం తాము ఎప్పట్నుంచో తాపత్రయపడుతుంటే కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదన్నారు. పార్టీలో ఒక వర్గం తెరాసకు అనుకూలంగా పనిచేస్తుంటే మీరు చూస్తూ ఏం చేస్తున్నారని నిలదీశారట! ఆరేళ్లలో పార్టీ చేసిన ఒక్క ఉద్యమం ఏదైనా ఉంటే చెప్పగలరా అంటూ కుంతియాని ప్రశ్నించారని సమాచారం.
ఉన్నట్టుండి కుంతియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి..? ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఆయన్ని కూడా మార్చేస్తారనే కదా ఈ మధ్య వినిపించింది? అయినా, ఆరేళ్లుగా మీరేం చేశారని కుంతియాని నిలదీసే ముందు… అదే ప్రశ్న వారు కూడా వేసుకోవాలి కదా. కుంతియా స్థానిక నాయకుడు కాదు, ఆయనకి పార్టీ ఇచ్చిన బాధ్యత ప్రకారమే పనిచేస్తారు. వేరే రాష్ట్రానికి హైకమాండ్ బదిలీ చేస్తే వెళ్లిపోతారు. ఇప్పుడు ఆగ్రహావేశాలకు లోనౌతున్న సీనియర్లంతా లోకలే, పార్టీ కోసం పాటుపడొచ్చు కదా. అన్నిటికీ మించి ఐకమత్యంగా ఉండొచ్చు. ఇవాళ్ల కుంతియాని నిలదీయడంలో కనిపిస్తున్న ఐకమత్యం… పార్టీపరంగా ఇతర కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదే? పీసీసీ అధ్యక్ష పదవి దగ్గరకి వచ్చేసరికి ఈ నాయకులే ఒకరితో ఒకరు పోటీ పడతారు! అయినా… మున్సిపల్ ఎన్నికలు ముందు పెట్టుకుని ఈ పంచాయితీలేంటి?