అమరావతిలో రైతుల పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తూ వారికి అండగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేగంగా వేయడానికి సిద్ధమవుతున్నారు. జగన్‌పై పోరాటానికి మరింత పదును పెట్టాలనుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. మరి ఇంతకూ ఆయన ఏం చేయబోతున్నారు? కోర్టు గుమ్మం ఎక్కబోతున్నారు. మానవ హక్కుల సంఘం తలుపు తట్టబోతున్నారు. రాజధాని తరలింపు ఎపిసోడ్‌లో కోర్టుకెళతారని మొదటి నుంచి అందరూ అనుకుంటున్నదే. రైతులు కోర్టుకెళితే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని, భారీగా నష్టపరిహారం చెల్లించాల్సివస్తుందని చెబుతున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులే హైకోర్టుకు వెళ్లి పోరాడినప్పుడు ఏపీలో విలువైన భూములు రాజధాని కోసం అప్పగించిన రైతులు కోర్టుకు వెళ్లకుండా ఎలా ఉంటారు. కోర్టుకు వెళతారు సరే, మరి మానవహక్కుల సంఘానికి ఎందుకు? అమరావతి రైతుల ఉద్యమంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఈమధ్య పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు మహిళలను కూడా కొట్టడం, హింసించడం, రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం, రహదారులపై బారికేడ్లు, ఇనుప తీగల కంచెలు అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకోవడం….ఇలాంటి చర్యలు మానవహక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.
పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఎవ్వరినీ ఈజీగా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వంతో రైతులు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని కాదని రాజధాని తరలించేందుకు అవకాశం లేదన్నారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణం కొనసాగించాలనుకుంటే లక్షా 10 వేల కోట్లు ఖర్చవుతాయని, అంత భారం మోయలేమని ప్రభుత్వం చెబుతోంది. రాజధానిని విశాఖకు తరలిస్తే చాలా తక్కువతో అక్కడ పనులు పూర్తవుతాయని మంత్రులు ఊదరగొడుతున్నారు.
రైతులు కోర్టుకు వెళితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బే. కోర్టు రైతులకు సానుకూలంగా తీర్పు ఇస్తే దాదాపు 72 వేల కోట్లు (ఇది అంచనా మాత్రమే) పరిహారం కింద చెల్లించాల్సి వస్తుందని నిపుణులు, న్యాయవాదులు చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సింది కేవలం రైతులకే కాదు, అక్కడ నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీలకు, గత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలకు చెల్లించాల్సివుంటుంది. పనుల కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని మధ్యలో ఆపేస్తే నష్టం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా కోర్టుకు వెళతారు. మరి వైకాపా నేతలకు, ప్రభుత్వానికి ఈ సంగతి తెలియదా?
రైతులకు వారి భూములు తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇది కూడా చర్చనీయాంశమైంది. రైతులకు వారి భూములు యథాతథంగా ఎలా తిరిగిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. వివిధ నిర్మాణాలతో భూముల స్వరూప స్వభావాలు మారిపోయాయి. వాటిని రైతులకు ఎలా ఇస్తారు?…ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయి. కాబట్టి రైతులు కోర్టుకు వెళ్లక తప్పదు. ఈ కథంతా టీడీపీయే నడిపిస్తుంది.