తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు తాత్కాలిక బ్రేక్ పడింది అనొచ్చు! ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 7వ తేదీ ఉదయం నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే, మంగళవారం సాయంత్రం వరకూ నోటిఫికేషన్ విడుదలను వాయిదా వేసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్లను ప్రకటించిన నెల రోజుల తరువాత ఎన్నికల ప్రక్రియ జరపాలనీ, ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు నిర్వహించొద్దనీ, వాయిదా వేయాలంటూ హైకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదే కేసు మీద సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఎన్నికల నోటిఫికేషన్ ని గత నెల 23నే ఇచ్చేశామనీ, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాం కాబట్టి దీన్లో కోర్టు జోక్యం చేసుకోకూడదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ తేదీలు చాలా దగ్గరగా, అభ్యర్థులకు కనీసం ఇవ్వాల్సిన గడువు సరిపోదన్నట్టుగా ఉన్నాయని వాదించింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ… ఎన్నికల మేన్యువల్ ని తప్పుల తడకగా తయారు చేస్తుండటం ఎన్నికల సంఘం అధికారులకు ఎప్పటికప్పుడు అలవాటైపోయిందని వ్యాఖ్యానించడం విశేషం! జనవరి 4 నాటికి ఓటర్ల జాబితాను పూర్తిచేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిందనీ, కానీ ఆ గడువు కంటే ముందుగా డిసెంబర్ 23కే ఎలా పూర్తి చేయగలిగారు అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల మేన్యువల్ ని వెంటనే తమకు సమర్పించాలని కోర్టు కోరింది. అయితే, ఈవెంట్స్ మేన్యువల్ ఇవాళ్ల తమ దగ్గర లేదనీ, ప్రొసీజర్ మాత్రమే ఉందని కోర్టుకు అధికారులు చెప్పారు.
మంగళవారం నాడు మేన్యువల్, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మొత్తం ఈవెంట్స్ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. దాన్ని పరిశీలించాక… అన్నీ సక్రమంగా ఫాలో అయ్యారో లేదో చూస్తామని కోర్టు చెప్పింది. అంతవరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ స్పష్టం చేసింది. దీంతో, మంగళవారం జరగబోతున్న వాదోపవాదాలు కొంత ఆసక్తికరంగా మారాయి. రేపు సాయంత్రం న్యాయస్థానం ఏదైనా కీలక ప్రకటన చెయ్యొచ్చు అనే ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నట్టు సమాచారం.