ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది ‘అల వైకుంఠపురములో’. అనేక డౌట్లు, డైలామాల తరవాత జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ఇది. అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా గతేడాది బన్నీ నుంచి సినిమా ఏదీ రాలేదు. త్రివిక్రమ్ ఫామ్‌లో ఉన్నాడు. సంక్రాంతి సీజన్లో వస్తున్న సినిమా ఇది. ఎలా చూసుకున్నా – అనేక బరువుల్నీ, బాధ్యతల్నీ మోసుకుంటూ వస్తోంది. టీజర్, పాటలు మెగా అభిమానులకు కిక్ ఇచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది.
2.25 నిమిషాల పాటు సాగే ట్రైలర్ ఇది. లక్ష పనులు – కోటి వర్రీస్ ఉండే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడూ నిజాలే మాట్లాడే క్యారెక్టర్ హీరోది. చిన్నప్పటి నుంచీ తన జీవితంలో ‘ఆహా’ అనుకునే ఒక్క రోజు కూడా లేదు. కారణం… నాన్నే. అందుకే నాన్నంటే ఓ రకమైన కోపం. ‘నిజం చెప్పేటప్పుడే భయమేస్తుంది నాన్న – చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టర్ మొత్తం బయటపెట్టేశాడు త్రివిక్రమ్. అలాంటి అబ్బాయి ఓ పెద్దింటి కుటుంబంలో చేరడం, ఆ తరవాత జరిగే పరిణామలే ఈ సినిమా కథ.
దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, ఒకటి ఆళ్లకి అంటూ – హీరోయిన్ కుటుంబం స్టేటస్ మొత్తం ఒక్క డైలాగ్‌లో చెప్పించేశాడు. మేడమ్ అంటూ హీరోయిన్‌తో క్యూట్ క్యూట్ మూమెంట్స్, స్టైలీష్ ఫైట్లూ, కొన్ని స్టెప్పులూ… అక్కడక్కడ సముద్రఖని విలనిజం… ఇలా సాగిపోయింది ట్రైలర్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునేవాళ్లతోనే అనే డైలాగ్ బాగుంది. కాల్మీ వెన్ ఫ్రీ అనే చోట బన్నీలోని రొమాంటిక్ యాంగిల్ బయటపడింది. హర్షవర్థన్‌కి సైతం డైలాగ్ ఇచ్చారు గానీ, సునీల్‌తో ఒక్క మాట కూడా పలికించలేదు. ఎందుకనో. రాజేంద్రప్రసాద్, పూజా హెగ్డేలకూ డైలాగులు లేవు.
హీరోయిజం ఎలివేట్ చేయడానికి – పులి వచ్చింది – మేక చచ్చింది – లాంటి డైలాగులు వాడారు.
మొత్తానికి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తోంది. యాక్షన్, ఫన్ వీటికి బాగానే చోటిచ్చారు. కాకపోతే త్రివిక్రమ్ స్టైల్ డైలాగుల్లో కనిపించలేదు. వినిపించలేదు. బన్నీతో అదిరిపోయే స్టెప్పు ఒక్కటీ వేయించలేదు. అవన్నీ సినిమా కోసం దాచేసుకున్నారేమో.