ఓ కేసులో ఎంత మంది అనుమానితులుంటారు..? అదీ కూడా.. అడ్డంగా నరికేసిన పొజిషన్లో కనిపించిన మనిషిని ఆత్మహత్య అని ప్రచారం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఆధారాలన్నీ కడిగేశారు. నరికేసిన గాయాలకు డాక్టర్ వచ్చి డ్రెస్సింగ్ చేశారు. ఇన్నీ చేసిన హత్య కేసులో.. అనుమానితులు ఎవరో… క్రైం సీరియళ్లు చూసేవారు కూడా చెబుతారు. కానీ వివేకా హత్య కేసులో పోలీసులు దాదాపుగా మొత్తం పులివెందుల ప్రజల్ని అనుమానించేస్తున్నారు. ఏకంగా 1461 మంది అనుమానితులంటూ.. లెక్క చెబుతున్నారు. ఇది అధికారికంగా… హైకోర్టుకు పోలీసులు చెప్పిన లెక్క. ఈ లెక్క విని.. సాధారణ ప్రజలు కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి.
పోలీసులు కావాలనే.. వివేకా హత్య కేసు విచారణను.. నిర్లక్ష్యం చేస్తున్నారని.. రాజకీయ ప్రత్యుర్థుల్ని మానసికంగా వేధించడానికి వాడుకుంటున్నారంటూ… ఎమ్మెల్సీ బీటెక్ రవి.. సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై.. ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు వివరాలను.. అందించాలని హైకోర్టు.. అటు పోలీసుల్ని.. ఇటు హోంశాఖను ఆదేశించింది. ఇందులో.. పోలీసులు తమకు తాము సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తాము ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు చేస్తున్నామని… ఇప్పటికి 1,523 మందిని ప్రశ్నించామని అఫిడవిట్ దాఖలు చేశారు. వీరిలో 1,461 మంది అనుమానితులు, 62 మంది సాక్షులని చెప్పుకొచ్చారు.
స్పష్టమైన సాక్ష్యాలు కళ్లెదుట ఉన్న సమయంలో… సాంకేతిక ఆధారాలు… నిరూపించడం క్షణాల్లో సాధ్యమైన పరిస్థితుల్లో… అత్యాచారం వంటి కేసుల్లో 21 రోజులకే శిక్ష వేయాలని ఏపీ ప్రభుత్వం చట్టం చేసిన వేగంతో…పోలిస్తే.. కడప జిల్లా పోలీసులు.. వివేకా హత్య కేసు విచారణ సాగిస్తున్న తీరు సామాన్య ప్రజల్ని సైతం విస్మయానికి గురి చేస్తోంది. కేసును మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నంలోనే.. పోలీసులు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది. అయితే.. తామ ది బెస్ట్ అనేలా విచారణ చేస్తున్నారమని.. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని.. పోలీసులు అఫిడవిట్లో చివరిగా కోర్టును కోరారు.