అమరావతిలోని సచివాలయం ఉద్యోగుల్లో ఆగ్రహం, ఆవేదన తన్నుకొస్తున్నాయి. దాదాపుగా అందరు ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారంతా మీడియా ముందు ఓపెనప్ అయ్యారు. మహిళా ఉద్యోగులు కన్నీరు పెట్టుకుంటూ ఉండగా, పురుష ఉద్యోగుల ముఖాల్లో తీరని ఆవేదన కనబడింది. ప్రతిరోజూ వస్తున్న రాజధాని తరలింపు వార్తలతో తమకు నిద్ర పట్టడంలేదని, తమ జీవితాలేమిటో అర్థం కావడంలేదని అన్నారు. ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీద ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. తమను సమావేశానికని పిలిచి రాజధాని తరలింపు వివరాలు చెప్పకుండా మోసం చేశారని అన్నారు.
హైదరాబాదు నుంచి వచ్చాక ఇప్పుడిప్పుడే ఇక్కడ సెటిలవుతున్నామని, బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్లు కట్టుకున్నామని, కొందరం కొనుక్కున్నామని, జీతంలో చాలా భాగం ఈఎంఐలు కడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఉన్నపళంగా విశాఖపట్టణం పొమ్మంటే చాలా ఇబ్బందులు పడతామని కళ్లనీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చినప్పుడు కూడా ఇంత బాధ పడలేదన్నారు. అమరావతి చాలామంది ఉద్యోగులకు వారి సొంత జిల్లాలకు దగ్గరగా ఉందని, అలాగే హైదరాబాదుకు దగ్గరగా ఉందని చెప్పారు. రాజకీయ నాయకులు తమకు వ్యక్తిగత కక్షలుంటే తమలో తాము చూసుకోవాలని, వారి కక్షలకు తమను బలి చేయడమేమిటని ప్రశ్నించారు. రైతులకంటే ఎక్కువగా తాము బాధ పడుతున్నామన్నారు.
తాము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి బహిరంగంగా మాట్లాడకూడదు కాబట్టి ఇన్నాళ్లు మాట్లాడలేదన్నారు. దాదాపు అందరు ఉద్యోగులు ఏడ్చుకుంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాల్సిందే కదా. హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చారు. రాజధాని విశాఖకు తరలిపోతే అక్కడికి వెళ్లితీరాల్సిందే. విశాఖకు వెళ్లేది లేదంటూ ఆందోళనలు, ధర్నాలు చేయకూడదు. ఉద్యోగులు కొత్త రాజధానికి వెళ్లడంపై ఉద్యోగుల సంఘానికి చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఉన్నాయని చెప్పాడు.
ఒకటి…విశాఖకు వెళ్లి డ్యూటీలో చేరడం, రెండు…ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవడం. కాబట్టి ఉద్యోగం కావాలనుకుంటే విశాఖకు వెళ్లాల్సిందే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయాన్ని అమరావతికి తరలించారు. పరిపాలన ప్రజలకు చేరువలో ఉండాలని అమరావతికి తరలించినట్లు బాబు చెప్పినా, ఓటుకు నోటు కేసు కారణంగా ఇబ్బంది కలగడంతో అమరాతికి తరలించారని ప్రత్యర్థులు చెబుతుంటారు. కారణాలు ఎలా ఉన్నా ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లక తప్పలేదు. సచివాలయంలోనే కాదు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వేలాది ఏపీ ఉద్యోగులు హైదరాబాదులో పర్మ్నెంట్గా స్థిరపడ్డారు.
ఆక్కడే ఇళ్లు కట్టుకున్నారు. అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. సంబంధ బాంధవ్యాలు అక్కడే ఉన్నాయి. ఏ కోణంలో చూసినా హైదరాబాదుతో విడదీయరాని బంధం ఉంది. ఉద్యోగుల్లో సింహభాగం కుటుంబాలను హైదరాబాదులోనే ఉంచి అమరావతికి వెళ్లారు. అప్పట్లో ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు వారి కోరిక ప్రకారం ఫైవ్డే వీక్ (వారానికి ఐదు పనిదినాలు) అమలు ప్రారంభించారు. దీంతో ఉద్యోగులు శని,ఆదివారాలు హైదరాబాదుకు వచ్చే అవకాశం కలిగింది.
ఉద్యోగులు హ్యాపీగా ఫీలయ్యారు. ఉద్యోగుల కోసం హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు వేశారు. ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వెలగపూడి, దాని చుట్టుపక్కల, విజయవాడ, గంటూరుల్లో ఇళ్లు కట్టుకున్నారు. అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఎక్కవమంది బ్యాంకు రుణాలు తీసుకొని కట్టుకున్నవారే. ఈవిధంగా ఉద్యోగులు నెమ్మదిగా స్థిరపడుతున్న నేపథ్యంలో వారి మీద ‘రాజధాని మార్పు’ బాంబు పడింది. కాని వారు చేసేది ఏముంది? ఆగ్రహం కలిగినా, ఆవేదన ఉబికి వస్తున్నా కొత్త రాజధానికి తరలివెళ్లక తప్పదు.